జూబ్లీహిల్స్ లో మందకొడిగా మొదలై.. ఊపందుకున్న పోలింగ్

జూబ్లీహిల్స్ లో మందకొడిగా మొదలై..  ఊపందుకున్న పోలింగ్
  • ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం​
  • మధ్యాహ్నం ఒంటి గంటకు 31 శాతం 
  • సాయంత్రం ఆరు గంటలకు మరింత పెరిగిన పోలింగ్​ 

హైదరాబాద్​సిటీ, వెలుగు : జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలో ఉదయం 7 గంటలకు పోలింగ్​ప్రారంభమైనా మందకొడిగానే కొనసాగింది. రహ్మత్​నగర్​లోని 165 పోలింగ్ స్టేషన్ లో ఈవీఎం మొరాయించింది. దీంతో అధికారులు వెంటనే  కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేసి ఎలక్షన్​కొనసాగేలా చేశారు. షేక్ పేట్ డివిజన్ 30వ నంబర్​పోలింగ్ బూత్ నెంబర్ లో టెక్నికల్ ఇష్యూ వల్ల పోలింగ్​ఆలస్యమైంది. 

రహమత్​నగర్, ఎర్రగడ్డ, షేక్​పేట డివిజన్ల పరిధిలోని పోలింగ్​ కేంద్రాలకు ఉదయం నుంచే ఓటర్ల రాక పెరిగింది. 9 గంటల సమయానికి ఆయా డివిజన్ల పరిధిలో 11శాతం పోలింగ్​నమోదైంది. తర్వాత పోలింగ్​ కేంద్రాల వద్ద సందడి పెరిగింది. ముఖ్యంగా ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్​గూడ డివిజన్లలోనూ ఓటర్లు పోలింగ్​బూతులకు తరలి వచ్చారు. దీంతో ఉదయం 11 గంటలకు 20.76 శాతం పోలింగ్​ నమోదయినట్టు అధికారులు తెలిపారు. 

పోలింగ్​ కేంద్రాలకు ఓటర్ల తరలింపు

పోలింగ్​శాతం తక్కువగా ఉండడంతో వివిధ రాజకీయ పార్టీల వారు కూడా ఓటర్ల తరలింపు కార్యక్రమం కొనసాగించారు. ముఖ్యంగా బస్తీలు, కాలనీల నుంచి జనాలు పోలింగ్​కేంద్రాలకు చేరుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. 

కొందరు ఆటోలను, టూవీలర్స్​ ను అందుబాటులో ఉంచారు. పోలింగ్​స్టేషన్​కు రాలేని వారి కోసం ఎన్నికల అధికారులు సైతం వీల్​చైర్లు, ఇతర వాహనాల ద్వారా పోలింగ్​ఓటువేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో చాలా పోలింగ్​ కేంద్రాలు రద్దీగా కనిపించాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి పోలింగ్ 31 శాతానికి చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత మళ్లీ చాలా పోలింగ్​కేంద్రాలు ఖాళీగా కనిపించాయి. మధ్యాహ్నం 3గంటల సమయానికి పోలింగ్​40 శాతానికి చేరింది. 

సాయంత్రం తర్వాత ముఖ్యంగా మైనారిటీలు అధికంగా ఉండే బోరబండ, ఎర్రగడ్డ, షేక్​పేట,యూసుఫ్​గూడ తదితర ప్రాంతాల్లో మళ్లీ పోలింగ్​పెరిగి సాయంత్రం 6గంటల సమయానికి 47 శాతం పోలింగ్​నమోదైంది. అయితే ఓటర్లకు అదనంగా మరో గంట పాటు ఓటింగ్​కు అవకాశం కల్పిస్తామన్న ఎన్నికల అధికారులు సాయంత్రం 6గంటల వరకు పోలింగ్​సమయాన్ని పెంచారు. ఆఖరు గంట సమయంలో పోలింగ్​ బాగానే పుంజుకుంది. దీంతో పోలింగ్​ ముగిసే సమయానికి 48 నుంచి 50 శాతం పోలింగ్ ​నమోదైనట్టు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ అంచనా వేశారు.