
నిరసిస్తూ మృతుడి బంధువుల రాస్తారోకో
ఆర్మూర్, వెలుగు: శవయాత్ర పేరిట రోడ్డుపై న్యూసెన్స్ చేస్తున్నారని, కేసులు పెట్టాలని పోలీసులను జడ్జి ఆదేశించడంపై ఓ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. సుమారు మూడు గంటలపాటు రాస్తారోకో చేపట్టారు. ఈ సంఘటన శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగింది. ఆర్మూర్ కమలానెహ్రు కాలనీకి చెందిన ప్యాట్ల లక్ష్మణ్(50) మృతిచెందటంతో ఇంటి నుంచి మధ్యాహ్నం శవయాత్ర నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలోని కోర్టు పరిసరాలకు శవయాత్ర చేరుకోగానే.. ఓ కానిస్టేబుల్ వారి వద్దకు వచ్చి జడ్జి అభ్యంతరం చెప్తున్నారని అన్నారు.
డప్పుచప్పుళ్లతో రోడ్డుపై న్యూసెన్స్ చేస్తున్నారని, కేసు పెట్టాలని తమను ఆదేశించారని తెలిపారు. దీంతో మృతుడి బంధువులు, కుటుంబీకులు అక్కడే నిరసనకు దిగారు. మూడు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఫలితంగా ఎక్కడివాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఏసీపీ అందె రాములు, సీఐ రాఘవేందర్, బార్ అసోసియేషన్ సీనియర్ అడ్వకేట్లు వచ్చి రాస్తారోకో చేస్తున్న వారికి నచ్చజెప్పారు. ఎవరిపైనా కేసు నమోదు చేయటం లేదని ఏసీపీ స్పష్టం చేయటంతో వారు శాంతించారు.