హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని జడ్జీలు రేవతి, ప్రమిద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను, సౌకర్యాలను పరిశీలించారు. ముందుగా ఆపరేషన్ థియేటర్, ప్రసూతి వార్డు, జనరల్ వార్డులను సందర్శించారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న వైద్య విధానం గురించి, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మెడిసిన్ స్టోర్ రూమ్, ఐసీయూ, స్కానింగ్ విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో జడ్జిలతో పాటు అడ్వకేట్స్ మురళీమోహన్, రామకృష్ణ, కొండ ప్రవీణ్, శ్రీదేవి, జూమ్లా, రమేశ్, ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.

