జన్వాడ ఫామ్​హౌస్​పై తీర్పు రిజర్వ్

జన్వాడ ఫామ్​హౌస్​పై తీర్పు రిజర్వ్
  •  పూర్తయిన వాదనలు.. తీర్పు వాయిదా వేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్‌‌‌‌పల్లి మండలం జన్వాడలో జీవో 111 నిబంధనలకు వ్యతిరేకంగా మంత్రి కేటీఆర్‌‌‌‌ ఫామ్‌‌‌‌ హౌస్‌‌‌‌ కట్టుకున్నారంటూ కాంగ్రెస్‌‌‌‌ ఎంపీ రేవంత్‌‌‌‌రెడ్డి ఎన్జీటీలో వేసిన కేసును కొట్టేయాలని కోరుతూ.. కేటీఆర్, ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌ ఓనర్‌‌‌‌ ప్రదీప్‌‌‌‌రెడ్డిలు విడివిడిగా వేసిన రిట్లపై హైకోర్టు తీర్పును రిజర్వ్​లో పెట్టింది. శుక్రవారం వాదనలు పూర్తవడంతో తీర్పును తర్వాత చెబుతామని జస్టిస్‌‌‌‌ ఎ.రాజశేఖర్‌‌‌‌రెడ్డి, జస్టిస్‌‌‌‌ పి.నవీన్‌‌‌‌రావ్‌‌‌‌ల బెంచ్‌‌‌‌ వెల్లడించింది. ఎన్జీటీలో రేవంత్‌‌‌‌ రెడ్డి దురుద్దేశంతో కేసు వేశారని కేటీఆర్‌‌‌‌ తరఫు న్యాయవాది చేసిన వాదనల్ని రేవంత్‌‌‌‌ తరఫు సీనియర్‌‌‌‌ లాయర్‌‌‌‌ ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ ఖండించారు. దుర్మార్గపు ఆలోచనతో కాదని, హిమాయత్​సాగర్, ఉస్మాన్​సాగర్​ రిజర్వాయర్ల రక్షణ కోసమే అని తెలిపారు. రెండు రిజర్వాయర్ల పరీవాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాల గురించి 2020 ఫిబ్రవరిలో రేవంత్‌‌‌‌రెడ్డికి తెలిసిందని, వెంటనే అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారని వివరించారు. విపక్ష నేతగా ఉన్నందునే కేసు వేశారని చెప్పడం అన్యాయమన్నారు. ఎన్జీటీ ఆర్డర్‌‌‌‌పై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలే గానీ హైకోర్టుకు కాదన్నారు. అక్రమంగా నిర్మాణం జరిగిందా, జీవో111కు వ్యతిరేకంగా జరిగిందా అనేది తేల్చేందుకు ఎన్జీటీ సంయుక్త కమిటీ వేస్తే దానిపై స్టే ఇవ్వడం అన్యాయమన్నారు. కేటీఆర్​ను రాజకీయంగా దెబ్బతీసేందుకే రేవంత్‌‌‌‌ కేసు వేశారని కేటీఆర్​ తరఫు లాయర్‌‌‌‌ వాదించారు. ఫామ్ హౌస్‌‌‌‌ కేటీఆర్​దే కాదన్నారు. కావాలని బురద చల్లేందుకే రేవంత్‌‌‌‌ ఎన్టీటీలో కేసు వేశారన్నారు.