గ్లోబరినా టెండర్ పై జ్యూడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి

గ్లోబరినా టెండర్ పై జ్యూడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి

ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ కు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన గ్లోబరినా ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ సొల్యూషన్స్ సంస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్లోబరినా టెండర్ వెనుక భారీ కుంభకోణం ఉందన్నారు. దీనిపై జ్యూడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్,రాష్ట్ర అధ్యక్షులు నాగటి నారాయణ.

బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి.. విద్యార్థుల భవిష్యత్తుతో ఈ సంస్థ, అధికారులు ఆటలాడుతుందన్నారు. రిజల్ట్స్ కారణంగా ఇప్పటికి 16 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. ఇది ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యమన్నారు. చాలా మంది విద్యార్థులు రీవాల్యూషన్ కోరుతున్నారని తెలిపారు నాగటి నారాయణ. ఎగ్జామినర్ కి రోజుకి 30 జవాబు పత్రలే ఇవ్వాలసి ఉండగా… 45 చొప్పున ఎందుకిచ్చారని ప్రశ్నించారు. ఈ ఇంటర్ ఫలితాలు నమ్మదగినవి కాదన్న నాగటి నారాయణ…ఫెయిల్ అయిన వాళ్లలో చాలా మంది పాస్ అయ్యే ఉంటారన్నారు. నిరు పేదలు రివాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఈ సంక్షోభంకు బోర్డు సెక్రటరీ అశోక్ ను బలిపశువును చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.

ఇంటర్ రిజల్ట్ పై ఇంత జరుగుతున్నా… విద్యాశాఖ మంత్రి ఒక నిపుణుల కమిటీ వేశామని ప్రకటించి చేతులు దులుపుకున్నారన్నారు. తెలంగాణ తల్లిదండ్రుల సంఘం ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్లోబరినా సంస్థ ఓ అసమర్ధ సంస్థ అని…సీజీజీని కాదని ఒక ప్రైవేటు సంస్థకు టెండర్ ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటో చెప్పాలన్నారు.

ఇంటర్ బోర్డు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసి రోజుకు 45 పేపర్లను బలవంతంగా అధ్యాపకులతో దిద్దించిందని ఆరోపించారు నారాయణ. ప్రభుత్వ పెద్దలకు గ్లోబరినా సంస్థకు ఉన్న సంబంధం ఏంటి? గ్లోబరినా సంస్థకు అశోక్ కుమార్ కు సంబంధం లేదని తెలుస్తోందన్నారు. గ్రేడ్ చూపిస్తూ మరో వైపు మార్కులు ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించారు. గ్రేడింగ్ ఒక్కటే చూపించాల్సి ఉన్నా ఎవరి ప్రయోజనాల కోసం మార్కులు చూపిస్తున్నారన్నారు.

పక్క రాష్ట్రంలో ఇప్పటి వరకు మార్కులు చూపలేదన్న నాగటి నారాయణ…. అక్కడ విద్యార్థుల ఆత్మహత్యలు కూడా జరుగలేదన్నారు. తెలంగాణలో ప్రైవేటు కాలేజీలతో లాలూచీపడి మార్కులు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.