
చిత్తూరు జిల్లాలో మూడు నామాలతో ఆవు దూడ జన్మించడం వైరల్ గా మారింది. చౌడేపల్లె మండలం గడంవారిపల్లె పంచాయితీ(యల్లంపల్లె) గ్రామంలో మూడు నామాలతో పేయ దూడ జన్మించడంతో తిరుపతి వెంకన్న మహిమతో ఆవు దూడ జన్మించిందని భావిస్తున్నారు గ్రామస్తులు. మొక్కు చెల్లించాల్సిన సమయంలో యాదృచ్ఛికంగా మూడు నామాలతో దూడ జన్మించడంతో స్వామి మహిమగా రైతు భావిస్తున్నాడు.
పెద్దకంపల్లెకు చెందిన రవినాయుడుకి సంబంధించిన పశువులకు గత ఏడాది లంపిస్కిన్ వ్యాధి సోకింది. వ్యాధి నయమైతే ఓ దూడను టీటీడీ గోశాలకు ఇస్తానని మొక్కుకున్నాడు. ఆ తర్వాత ఆవులకు వ్యాధి నయమైనప్పటికీ పనుల వత్తిడిలో మొక్కు వాయిదా వేస్తూ వచ్చాడు. రెండు రోజుల క్రితం ఓ ఆవు ఒక పేయదూడకు జన్మనిచ్చింది. ఆ దూడకు నుదుటిపై తెల్లరంగులో మూడు నామాలుండటం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు రైతు కుటుంబ సభ్యులు.
ALSO READ : భూమి పొరల్లో ఖాళీ లేనంత వాన..
మూడు నామాలతో దూడ జన్మించడం స్వామి మొక్కును గుర్తు చేస్తున్నారని రైతు రవినాయుడు చెబుతున్నాడు. దీంతో గతంలో గోశాలకు ఇద్దామనుకున్న దూడతో పాటు నామాలతో పుట్టిన దూడను కూడా టీటీడీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. మొక్కు చెల్లించాల్సిన సమయంలో మూడు నామాలతో దూడ జన్మించడంతో స్వామి వారికి దూడను ఇవ్వనున్నట్లు ప్రకటించాడు రైతు.