సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశాం.. విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణిస్తున్నాం: సీఎం చంద్రబాబు

సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశాం.. విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణిస్తున్నాం: సీఎం చంద్రబాబు

శుక్రవారం ( ఆగస్టు 15 ) 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశామని.. విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న ఫించన్లు మొదలుకొని స్త్రీ శక్తి పేరిట ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వరకు వివిధ సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు చంద్రబాబు. అలాగే ఏపీ బ్రాండ్ గురించి.. పెట్టుబడుల సాధనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి వివరించారు. దీంతో పాటు రాష్ట్రంలోని వివిధ వర్గాలకు అందించిన సేవలను.. ఆయా రంగాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు సీఎం చంద్రబాబు. 

ఈ క్రమంలో వైసీపీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. కొందరు రాజకీయ ముసుగులో నేరాలు చేస్తూ.. ప్రోత్సహిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, తప్పులు ప్రతి శాఖలో వెలుగు చూస్తున్నాయని అన్నారు చంద్రబాబు. వైసీపీ హయాంలో నిలిపేసిన పథకాలను తాము పునరుద్ధరిస్తున్నామని స్పష్టం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో వైసీపీ డ్రామాలు ఆడిందని మండిపడ్డారు చంద్రబాబు.

గత ప్రభుత్వం కొత్త జిల్లాలను అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసిందని.. ఇప్పుడు వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. గతంలో జరిగిన రెవెన్యూ అక్రమాలను సరి చేసి.. పేదల భూములకు రక్షణ కల్పించామని అన్నారు సీఎం చంద్రబాబు. వృధాగా సముద్రంలో కలుస్తున్న వరద జలాలను వాడుకుంటే.. ఎగువ రాష్ట్రాలకు ఇబ్బంది ఉండదని అన్నారు చంద్రబాబు. వరద వచ్చినప్పుడు కిందకు వదిలేస్తున్న  వాళ్ళు అదే వరద నీటిని వాడుకుంటే అభ్యంతరం చెప్పడం సమంజసమా అని ప్రశ్నించారు.