చేతుల్లో సీసాలతో జగ్లింగ్ చేస్తోంది

చేతుల్లో సీసాలతో జగ్లింగ్ చేస్తోంది

హన్ అనే పన్నెండేండ్ల అమ్మాయి.. కత్తి పిడిని పళ్లతో పట్టుకుని, పదునైన కత్తి మీద మెటల్ బాల్ నిలబెడుతుంది. ఒకే టైంలో అలాంటి బాల్స్ ఒక పది వరకు తన ఒంటిపై కొన్ని భాగాల్లో బ్యాలెన్స్​ చేస్తుంది. అంతేకాదు... హులా–హూప్ రింగ్​ తిప్పుతూ కూడా వాటిని బ్యాలెన్స్‌ చేస్తూనే, చేతుల్లో సీసాలతో జగ్లింగ్ చేస్తుంది. తన పర్ఫార్మెన్స్​తో ఆడియెన్స్​ను మెస్మరైజ్ చేస్తుంది. ప్రాక్టీస్​ వీడియోలు ఆన్​లైన్​లో అప్​లోడ్  చేస్తే, తక్కువ టైంలోనే మిలియన్ వ్యూస్​ వస్తాయి. 

మయన్మార్​లో పుట్టిన హన్ పూర్తి పేరు హన్ మెయింట్. 71 ఏండ్లున్న వాళ్ల తాత ఒన్ మెయింట్, ఆమెకి ‘జగ్లింగ్’​ నేర్పిస్తున్నాడు. ఒన్​ ఎంతో చురుగ్గా ఉంటాడు. ఈ వయసులోనూ మనవరాలితో పోటీ పడి పర్ఫార్మ్​ చేస్తాడు.‘‘ ఇది మా సంప్రదాయ కళ. అది ఇప్పుడు కనుమరుగైపోతోంది. ఈ కళను తరువాత తరాలకు అందించాలనే ఈ వయసులో కూడా ఎంతో ఓర్పుగా నేర్పిస్తున్నా. నా పన్నెండేండ్ల మనవరాలు హన్ చాలా బాగా నేర్చుకుంటోంది. పురాతనమైన ఈ కళకు పూర్వ వైభవం తేవాలన్నదే నా లక్ష్యం’’ అని చెప్పాడు ఒన్.  

తాతతో గొడవపడ్డా...

‘‘రోజూ మూడు గంటలు శిక్షణ తీసుకుంటా. అప్పుడప్పుడు ప్రాక్టీస్​ టైంలో చాలా ట్రిక్స్​ గుర్తుపెట్టుకోలేకపోయేదాన్ని. దాంతో చికాకొచ్చి, తాతయ్యతో గొడవ పడేదాన్ని కూడా. ఇప్పుడు నా ప్రాక్టీస్​ వీడియోలు ఆన్​లైన్​లో​ పెడుతున్నా. ఆ వీడియోలను లక్షలమంది చూస్తున్నారు. కామెంట్స్​లో చాలామంది నన్ను మెచ్చుకుంటున్నారు. అది చూసి చాలా హ్యాపీగా అనిపిస్తోంది. మా తాతయ్య కలను నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉంది” అని చెప్పింది హన్. 

ఈ కళ ఇప్పటిది కాదు

19వ శతాబ్దంలో రాయల్ కోర్ట్​లో మొదటిసారి గ్లాసులు, బాల్స్​తో జగ్లింగ్​ చేశారు. అప్పుడు ఈ కళను ‘వ్యాల్’ అని పిలిచారు. అయితే, ఇది మామూలు సర్కస్​లా కాకుండా కాస్త డిఫరెంట్​గా ఉండేది. పాదాలు, మోకాళ్లు, భుజాలు, మోచేయి మీద ద్రాక్షపండు సైజులో ఉన్న బాల్​​ని నిలబెట్టి, అవి కింద పడకుండా పర్ఫార్మ్​ చేస్తారు. యూరప్​, నార్త్ అమెరికాల్లో జగ్లింగ్​ షోలు చూడ్డానికి టికెట్ కొనుక్కుని గుంపులుగా వచ్చేవాళ్లు. యాన్గాంగ్​లో ఈ షోలను స్కూల్, మాల్స్​లో ప్రదర్శించేవాళ్లు. అయితే, ఇప్పుడు తాత, మనవరాళ్లు కలిసి షోలు చేస్తున్నారు. వాళ్ల పర్ఫార్మెన్స్​లను ఆన్​లైన్​లో పెడితే 30 లక్షలకు పైగా వ్యూస్​ వచ్చాయి. 

అనుకోకుండా నేర్చుకుని..

40 ఏండ్ల వయసులో ఒన్, తన ఫ్రెండ్ వాళ్ల తాత దగ్గర ఈ ఆర్ట్​ నేర్చుకున్నాడు. అయితే, ఒన్ ఇది నేర్చుకోవడం వెనక పెద్ద కారణమే ఉంది. ఒకసారి ఒన్​కి స్ట్రోక్ రావడంతో చేతులు చచ్చుబడ్డాయి.  వాటిని తిరిగి మామూలు స్థితికి తెచ్చే ప్రయత్నంలో మెడిటేషన్ చేసేవాడు. దానివల్ల ఏకాగ్రత పెరిగింది. ‘‘జగ్లింగ్​ పర్ఫార్మ్​ చేసేందుకు ఏకాగ్రత చాలా అవసరం. కోపం, ఉద్రేకం వంటివి ఉండకూడదు. అలాగే మనసు స్వచ్ఛమైన అద్దంలా ఉండాలి. క్రమశిక్షణతో నేర్చుకుంటేనే ఇది సాధ్యమవుతుంది” అని చెప్పాడు ఒన్.