టీనేజీ బాలికలకు ‘స్నేహ’హస్తం! మహిళా సంఘాల తరహాలో ఎస్‌‌హెచ్‌‌జీ గ్రూపులు

టీనేజీ బాలికలకు ‘స్నేహ’హస్తం! మహిళా సంఘాల తరహాలో ఎస్‌‌హెచ్‌‌జీ గ్రూపులు
  • 14-18 ఏండ్ల వయసు బాలికలతో ‘కిశోర బాలిక సంఘాలు’
  •     విమెన్ ఎంపవర్‌‌‌‌మెంట్‌‌, ఎడ్యుకేషన్, హెల్త్, సేఫ్టీ 
  • తదితర అంశాలపై అవగాహన 
  •     వరంగల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు
  •    యూనిసెఫ్ సహకారంతో 
  • శిక్షణా కార్యక్రమాలు 


హైదరాబాద్, వెలుగు: 
మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌‌హెచ్‌‌జీ) తరహాలోనే ‘కిశోర బాలికలకు సంఘాలు’ఏర్పాటు చేస్తున్నది. ఈ సంఘాలకు ‘స్నేహ’అని నామకరణం చేసింది. ఈ గ్రూపుల్లో 
14–18 ఏండ్ల మధ్య వయసున్న బాలికలు సభ్యులుగా ఉంటారు. 

బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంచడం, విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, ఆత్మనూన్యత భావాన్ని పోగొట్టడం, నాయకత్వ నైపుణ్యం, సామాజిక చైతన్యం, గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌‌పై అవగాహన కల్పించడం, బాల్య వివాహాలను అరికట్టడంవాటిపై అవగాహన కల్పించేందుకు వీటిని ఏర్పాటు చేస్తోంది. విమెన్ ఎంపవర్‌‌‌‌మెంట్ డెవలప్‌‌మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, సేఫ్టీ, ఫైనాన్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించేలా ప్రణాళిక రూపొందించింది. 

భేటీ బచావో.. బేటీ పడావో, రాష్ట్రీయ కిశోర స్వస్థ్య కార్యక్రమం, పోలీస్ శాఖ (ఆపరేషన్ స్మైల్, ముస్కాన్), విద్యా శాఖ, ఇందిరా మహిళా శక్తి, పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ (మెప్మా), మహిళా, శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ (కూలీల సంక్షేమ బోర్డు), తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ ట్రైనింగ్ (వృత్తి నైపుణ్య కార్యక్రమాలు), ఉపాధి కల్పన, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఓపెన్ స్కూల్ సొసైటీ, ఇంటర్మీడియట్ బోర్డు, స్వచ్ఛంద సంస్థలు తదితర విభాగాలతో ఈ కార్యక్రమాన్ని అనుసంధానం చేయనున్నారు. 

గ్రూపులో 5 నుంచి 20 మంది సభ్యులు.. 

‘స్నేహ’ప్రాజెక్టు అమల్లో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యునిసెఫ్) టెక్నికల్‌‌ భాగస్వామిగా ఉంటుంది. యునిసెఫ్, సెర్ప్, డబ్ల్యూసీడీ, ఇతర సంబంధిత శాఖలతో కలిసి ప్రతి బాలికా సంఘ సమావేశాల కోసం యునిసెఫ్ మాడ్యూల్స్, శిక్షణ సామగ్రి, సంబంధిత విషయాలను రూపొందించనున్నది. రాష్ట్రంలో 76,54,400 మంది యుక్త వయస్సు కలిగిన మహిళలు ఉన్నారు. ఇందులో పాఠశాల, కాలేజీ చదువుతున్నవారు, బయట ఉన్న బాలికలతో ఈ సంఘాలను స్థాపిస్తున్నారు. 

ముందుగా గ్రామ స్థాయిలో 14 –18 ఏండ్ల వయసు కలిగిన కిశోర బాలికలను గుర్తించి జాబితా రెడీ చేస్తున్నారు. అంగన్వాడీ, మహిళా సంఘాల సభ్యుల సహకారంతో ఇంటింటికెళ్లి బాలికలను గుర్తిస్తున్నారు. 5 నుంచి 20 మంది బాలికలతో ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తున్నారు. అదనంగా సభ్యులుంటే మరో గ్రూప్ ఏర్పాటు చేస్తారు. వీవో ఆఫీస్‌‌లో బాలికలు, వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి చర్చించిన తర్వాతే సంఘంలో చేర్చుకుంటున్నారు. అంగన్వాడీ, ఎస్‌‌హెచ్‌‌జీ నాయకులతో కలిసి హోమ్ విజిట్ల ద్వారా అసహాయ, అత్యంత బాధితులైన బాలికలను గుర్తించి సంఘంలోకి తీసుకుంటున్నారు. 

ప్రతి నెలా రెండుసార్లు సమావేశాలు.. 

బాలిక సంఘాలకు ప్రతి నెలా రెండుసార్లు సమావేశాలు నిర్వహించనున్నారు. సెకండ్ శనివారం లేదా ఆదివారం, నాలుగో శనివారం లేదా ఆదివారం సమావేశాలు ఉంటాయి. ఇందులో ప్రణాళిక, బడ్జెట్, శాఖల సమన్వయం, ఇతర సమస్యలపై చర్చించనున్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సమావేశ మినిట్స్ నిర్వహించి, కమిటీ నిర్ణయాలను సభ్యులకు తెలియజేస్తారు. కలెక్టర్ ఆధ్వర్యంలో వీటిని అమలు చేస్తారు. డ్రాపౌట్‌‌ విద్యార్థులు ఉంటే వారికి ఉచితంగా విద్య అందించడంతో పాటు అవసరమైన వనరులను సమకూరుస్తారు. '

సామాజిక భద్రత, ఆర్థిక అభివృద్ధి, వ్యక్తిగత పరిశుభ్రత, విమెన్‌‌ ఎంపవర్‌‌మెంట్‌‌, కెరీర్‌‌ గైడెన్స్‌‌ వంటి అంశాలపై నిపుణులతో మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశాలు బాలికల ఆలోచనా విధానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు తమ సమస్యలను స్వయంగా అర్థం చేసుకొని పరిష్కార మార్గాలు వెతికే నైపుణ్యం పెంపొందుతుందని అధికారులు భావిస్తున్నారు. 

బాలికలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. 

బాలికలకు భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘స్నేహ’సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్, డీఆర్డీవోలు సంబంధిత విభాగాలతో సమన్వయం చేస్తారు. జిల్లా స్థాయిలో అందుబాటులో ఉన్న చోట స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయనున్నారు. ఈ నెల 14న ‘బాలల దినోత్సవం’పురస్కరించుకొని ‘కిశోర బాలికల’తో మాక్ పార్లమెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. డ్రాపౌట్ పిల్లలకు విద్యను అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. 
–దివ్య దేవరాజన్,​ సెర్ప్ సీఈఓ

పైలట్‌‌గా వరంగల్‌‌, జోగులాంబ గద్వాల..

రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కనీసం ఒక ‘కిశోర్‌‌ బాలిక సంఘం’ఉండేలా ప్రభుత్వం ప్రణాళిక రెడీ చేసింది. ఇందులో భాగంగా వరంగల్‌‌, జోగులాంబ గద్వాల జిల్లాలను పైలట్‌‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ‘స్నేహ’సంఘాలను స్థాపించింది. ప్రస్తుతం ఈ రెండు జిల్లాల్లో ఇప్పటికే 650 కిశోర్‌‌ బాలిక సంఘాలు ఉన్నాయి. వరంగల్‌‌లో తరుణి స్వచ్ఛంద సంస్థ, గద్వాలలో ఎంబీ ఫాండేషన్ సహకారంతో ఇవి విజయవంతంగా కొనసాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,705 సంఘాలు ఏర్పాటు చేయగా.. దాదాపు 10 వేల మంది బాలికలు సభ్యులుగా ఉన్నారు. ఈ కార్యక్రమ అమల్లో భాగంగా ఏపీఎం (అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్స్), డీపీఎం (డిస్ట్రిక్ ప్రాజెక్ట్ మేనేజర్స్)కు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. యూనిసెఫ్‌‌ సహకారంతో వీవోలు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనుండగా.. సభ్యులకు ప్రత్యేకంగా అవగాహన, చైతన్య కార్యక్రమాలు, వర్క్‌‌షాప్స్‌‌, స్కిల్‌‌ ట్రైనింగ్‌‌లు, లైఫ్‌‌ స్కిల్‌‌ సెషన్లు నిర్వహించనున్నారు.