వద్దన్నా రుణాలిస్తూ వేధిస్తున్న లోన్ యాప్ నిర్వాహకులు

వద్దన్నా రుణాలిస్తూ వేధిస్తున్న లోన్ యాప్ నిర్వాహకులు

మీకు లోన్ అప్రూవ్ అయ్యిందని ఫోన్ కు మెసేజ్ రావడం....తెలియక వాటిని ఓపెన్ చేసి సైబర్ కేటుగాళ్ల బారిన పడడం ఈ మధ్య పరిపాటిగా మారింది.ఆశపడి లింకులు క్లిక్ చేశారంటే అంతే....జేబుకు చిల్లు,మనశ్శాంతి కోల్పోవడం ఖాయం.రోజు ఏదో ఓ చోట లోన్ నిర్వహకుల ఉచ్చులో పడుతూ మోసపోతూనే ఉన్నారు.

తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణానికి చెందిన జ్యాస్ సెంటర్ నిర్వాహకుడు గౌస్ లోన్ యాప్ నిర్వాహకుల చెరలో పడ్డాడు.తను అప్లై చేయకుండానే మీ లోన్ అప్రూవ్ అయ్యిందంటూ మెసేజ్ లింక్ వచ్చినట్టు బాధితుడు తెలిపాడు.ఎలాగు లోన్ అప్రూవ్ అయ్యింది కదా వ్యాపారానికి పనికొస్తుంది అనుకున్నాడు.వెంటనే లింక్ ఓపెన్ చేసి కావలసిన వివరాలు అందజేశాడు.అంతే అకౌంట్లో నాలుగు వేల రూపాయలు జమ కావడం.....ఆరు రోజుల్లో ఎనిమిది వేలు కట్టాలంటూ మెసేజ్ రావడం చకచకా జరిగిపోయాయి. ఆరు రోజుల తర్వాత ఎనిమిది వేలు కట్టగానే....అతని అనుమతి లేకుండా మళ్ళీ డబ్బులు జమ చేసి లోన్ కట్టాలంటూ మెసేజ్ లు రావడం మొదలయ్యాయి.ఇప్పుడైతే డబ్బులు కడతా నాకు లోన్ అవసరం లేదంటూ ఆ యువకుడు రెండవసారి లోన్ డబ్బులు కట్టేశాడు. 

యువకుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కేటుగాళ్లు మళ్ళీ డబ్బులు జమ చేసి వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టారు. లోన్ కట్టాలంటూ అసభ్యకర మెసేజ్ లు,వాట్సాప్ కాల్స్ చేయడం,మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫోటోలు కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారికి పెడతామంటూ బెందిరింపులకు దిగారు. దీంతో పరువు పోతుందని భయపడిన బాధిత యువకుడు దాదాపు 50 వేల రూపాయల వరకు కట్టి తన జేబు గుళ్ళ చేసుకున్నాడు.అయినా వారి ఆగడాలు ఆగకపోవడంతో చేసేదేమీ లేక సైబర్ క్రైం ఫోలీసులను ఆశ్రయించాడు. తెలియక చేసిన పనికి డబ్బు పోగొట్టుకోవడమే కాకుండా మనశ్శాంతి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.