ఏటీఎంలో నగదు దొంగిలించే వారిపై .. పీడీ యాక్టు కరెక్టే

ఏటీఎంలో నగదు దొంగిలించే వారిపై .. పీడీ యాక్టు కరెక్టే
  • ప్రభుత్వం జారీచేసిన జీవోను సమర్థించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : ఏటీఎంలలో నగదు చోరీలకు పాల్పడే నిందితులపై పీడీ యాక్ట్‌‌ కింద ముందస్తు నిర్బంధంలోకి తీసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను హైకోర్టు సమర్థించింది. మహబూబ్‌‌నగర్‌‌  జిల్లా కలెక్టర్‌‌ మే 1న పీడీ యాక్ట్‌‌ కింద ఉత్తర్వులు జారీ చేయగా దీనిని ఆమోదిస్తూ ప్రభుత్వం జూన్‌‌ 13న జీవో విడుదల చేసింది. పంజాబ్‌‌కు చెందిన  గుర్‌‌ గగన్‌‌ సింగ్‌‌ దిలో, భూపేందర్‌‌ సింగ్‌‌  అలియాస్‌‌  హర్జీత్ సింగ్‌‌పై పీడీ యాక్ట్  కింద ఉత్తర్వులు రిలీజ్  అయ్యాయి. వాటిని సవాల్‌‌  చేస్తూ నిందితుల తరపు సోదరుడు హర్పిందర్  సింగ్‌‌ దాఖలు చేసిన  హెబియస్‌‌  కార్పస్‌‌  పిటిషన్‌‌ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌‌ కె. లక్ష్మణ్, జస్టిస్‌‌  పి.శ్రీసుధతో కూడిన డివిజన్‌‌  బెంచ్‌‌  ఇటీవలే విచారించింది. 

నిందితులకు బెయిల్‌‌ వచ్చినా ప్రభుత్వ నిర్ణయం వల్ల జైల్లోనే ఉన్నారని పిటిషనర్‌‌   తరపు అడ్వొకేట్  చెప్పారు. దీనిపై ప్రభుత్వ అడ్వొకేట్  వాదిస్తూ.. ఏటీఎంలలో నగదు చోరీచేసే నిందితులను బయటకు విడిచిపెడితే ప్రమాదకరమన్నారు. భూపేందర్‌‌  సింగ్‌‌  అలియాస్‌‌ హర్జీత్‌‌ సింగ్‌‌ ఏటీఏం సాంకేతిక నిపుణుడిగా 15 ఏళ్లకుపైగా పనిచేశాని వివరించారు. ఏటీఎంలు తెరవడం, నగదు నింపడం, సీసీటీవీ కెమెరాలను అమర్చడంలో అతను నిపుణుడని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో రూ.30 లక్షలు, చిట్యాలలో రూ.3.42 లక్షలు, మహబూబ్‌‌నగర్‌‌  జిల్లా రాజాపూర్‌‌ లో రూ.7.82 లక్షలు చోరీచేసినట్లు అతనిపై కేసులు ఉన్నాయని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు బెంచ్.. ప్రజాధనాన్ని చోరీచేసే వారిపై పీడీ యాక్ట్‌‌ ప్రయోగం సమర్థనీయమేనని తీర్పు చెప్పింది.