చర్చలు విఫలం.. కొనసాగనున్న జూడాలతో సమ్మె

చర్చలు విఫలం.. కొనసాగనున్న జూడాలతో సమ్మె

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెలోకి దిగారు. సోమవారం ఓపీ, ఐపీ, ఎలక్టివ్ సర్జరీ డ్యూటీలకు హాజరవలేదు. ఎమర్జన్సీ డ్యూటీలకు మాత్రమే హాజరయ్యారు. జూడాల సమ్మెతో టీచింగ్ హాస్పిటళ్లలో పేషెంట్లు ఇబ్బంది పడ్డారు. ఓపీ కోసం వచ్చిన వారు గంటలకొద్ది సమయం నిరీక్షించాల్సి వచ్చింది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ జూడాలను పిలిపించుకుని, వారితో చర్చలు జరిపారు. జూడాలు కోరినట్టు ప్రతి నెలా స్టైపెండ్ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు కూడా విడుదల చేశారు. 

హాస్పిటళ్లలో డాక్టర్లపై దాడులు జరగకుండా సెక్యూరిటీ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయిస్తామని, ఇందు కోసం హోంశాఖతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. ఉస్మానియాకు కొత్త బిల్డింగ్ నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మంత్రితో భేటీ తర్వాత సోమవారం సాయంత్రం డీఎంఈ, డాక్టర్ వాణితో జూడాలు చర్చలు జరిపారు. జూడాల డిమాండ్లు అన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అయితే, కొత్త హాస్టల్ బిల్డింగులు, కాకతీయ మెడికల్ కాలేజీలో ఇంటర్నల్ రోడ్లు, హాస్పిటళ్లలో సెక్యూరిటీ అవుట్ పోస్టుల విషయంలో డీఎంఈ, మంత్రి క్లారిటీ ఇవ్వలేదని జూడాలు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు.