- పట్టణాలకు రెండేండ్లుగా ఒక్క రూపాయి ఇవ్వని ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్సే: కేటీఆర్
- ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లా నేతలతో సమీక్ష సమావేశం
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ నేతలకు ఆ పార్టీ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ పిలుపునిచ్చారు. రెండేండ్లుగా మున్సిపాలిటీలు, పట్టణాలకు ఒక్క రూపాయి కూడా చెల్లించిన ఏకైక ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలుస్తుందన్నారు. పట్టణపరిపాలన పూర్తిగా పడకేసిందని, పారిశుధ్యం మొదలు.. ప్రతి విషయంలోనూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల నేతలతో కేటీఆర్ మున్సిపల్ ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో మాజీ మంత్రి హరీశ్ రావు, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో గులాబీ జెండా ఎగరాలని నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా.. చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. మంత్రి పదవులను కేవలం సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ ప్రజలను, పట్టణాలను గాలికి వదిలేశారని విమర్శించారు. అందరూ కలసికట్టుగా పోరాడాలని, పార్టీ మంచి విజయం సాధించేలా ముందుకెళ్లాలని పార్టీ నేతలకు హరీశ్‌రావు సూచించారు.
