బల్దియాలపై నజర్ !.. కైవసం చేసుకునేందుకు పార్టీల వ్యూహాలు

బల్దియాలపై నజర్ !.. కైవసం చేసుకునేందుకు పార్టీల వ్యూహాలు
  • కామారెడ్డి  జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో యాక్టివ్​ అయిన లీడర్లు​ 
  • రిజర్వేషన్లు మారితే కుటుంబీకులను రంగంలోకి దింపేందుకు సన్నాహాలు
  • ఇప్పటికే ఓటర్లు చుట్టూ ప్రదక్షిణలు     

కామారెడ్డి, వెలుగు : మున్సిపల్ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ ​పెట్టాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీలు వ్యూహాత్మకంగా కసరత్తు చేస్తున్నాయి. నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్‌‌‌‌కుంద మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు ఓటర్ల చుట్టూ తిరుగుతున్నారు. పార్టీల తరఫున బరిలో నిలవాలనుకునే నాయకులు యాక్టివ్ అయ్యారు. ఆయా మున్సిపాలిటీలపై తమ జెండా ఎగరవేయాలని కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. 

రిజర్వేషన్లకు అనుగుణంగా కదలికలు.. 

కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలపై ముందుగానే కొందరు నేతలు దృష్టి  సారించారు. గత ఏడాది నుంచి పోటీ చేయాలనుకున్న వార్డుల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటర్లకు దగ్గరవుతున్నారు. ఈసారి వార్డుల రిజర్వేషన్లు మారనున్నాయనే సమాచారంతో కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. జనరల్ స్థానానికి బదులు మహిళలకు రిజర్వ్ అయితే కుటుంబ సభ్యులను బరిలోకి దింపేందుకు సిద్ధం చేస్తున్నారు. తాము ఆశించిన వార్డులో రిజర్వేషన్ అనుకూలించకపోతే మరో వార్డులో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇంకొందరు పార్టీల మార్పునకు సిద్ధమవుతున్నారు. ఇతర పార్టీల నుంచి అధికార కాంగ్రెస్ లో చేరేందుకు పలువురు నాయకులు, కార్యకర్తలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కొందరు చేరగా, మరికొందరు ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

మున్సిపాలిటీలపై పట్టు కోసం కాంగ్రెస్‌‌‌‌ కసరత్తు.. 

అధికారంలో ఉన్న కాంగ్రెస్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని కసరత్తు చేస్తోంది. ఎక్కువ వార్డులను గెలుచుకుని చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు  వ్యూహాలు రచిస్తోంది. గెలిచే సత్తా ఉన్న అభ్యర్థుల కోసం అన్వేషణ చేస్తోంది. కామారెడ్డిలో పలువురు ఆశావహులు ఇప్పటికే ముఖ్య నేతలను కలిసి టికెట్లు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. కొందరు తమకే టికెట్ వస్తుందన్న ధీమాతో వార్డుల్లో ప్రచారం కూడా ప్రారంభించారు. 

మెజార్టీ వార్డులు గెలిచేందుకు బీజేపీ వ్యూహం..

కామారెడ్డి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మూడు రోజుల కింద పట్టణ నాయకులు, కార్యకర్తలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించింది. మెజార్టీ వార్డుల్లో గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులు, లోపాలపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. 

కోటను తిరిగి దక్కించుకునేందుకు బీఆర్ఎస్ ​యత్నంగతంలో తమ ఆధీనంలో ఉన్న మున్సిపాలిటీలను మళ్లీ దక్కించుకోవాలని బీఆర్‌‌‌‌ఎస్ భావిస్తోంది. కామారెడ్డి, ఎల్లారెడ్డిల్లో పోటీకి సిద్ధంగా ఉన్న నాయకులు గులాబీ నేతలను కలుస్తున్నారు. కామారెడ్డిలో కొన్ని వార్డుల్లో అయితే ఆశావహులు ఇంటింటా తిరుగుతూ తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేస్తూ ఓటర్లను కలిసి మద్దతు కోరుతున్నారు. 

జిల్లా యంత్రాంగం సన్నద్ధం

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో 92 వార్డులు ఉన్నాయి. కామారెడ్డిలో 49, బాన్సువాడలో 19, ఎల్లారెడ్డిలో 12, బిచ్‌‌‌‌కుందలో 12 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయ్యింది. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించగా, వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఇటీవల మున్సిపాలిటీల వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించగా, జిల్లా స్థాయి సమావేశం పూర్తయ్యింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.