గాంధీ దవాఖానలో కలకలం.. జూనియర్ డాక్టర్ పై దాడి... హాస్పిటల్ ముందు జూడాల ధర్నా

గాంధీ దవాఖానలో కలకలం.. జూనియర్ డాక్టర్ పై దాడి... హాస్పిటల్ ముందు జూడాల ధర్నా
  • కొట్టిన పేషెంట్ అటెండెంట్
  • రక్షణ కల్పించాలంటూ డ్యూటీలు బంద్
  • అధికారులు హామీతో ఆందోళన విరమణ
  • బాధ్యురాలిపై కేసు నమోదు

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్‌ గాంధీ దవాఖానలో డ్యూటీలో ఉన్న ఓ జూనియర్ డాక్టర్​పై రోగి సహాయకురాలు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. నిరసనగా సోమవారం ఉదయం జూనియర్ డాక్టర్లు  విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు.  బాధ్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని అధికారులు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

అసలేం జరిగిందంటే? 

గాంధీ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ వార్డులో జూనియర్ డాక్టర్ శివశంకర్ ఆదివారం రాత్రి డ్యూటీలో ఉన్నారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక మహిళకు తోడుగా మౌనిక మెర్లిన్ అనే యువతి ఉంది. రాత్రి 7.30 గంటలకు పేషెంట్​కు షుగర్ లెవల్స్ చెక్ చేయాలని మౌనిక అడిగింది. డాక్టర్ శివశంకర్ స్పందించి టెస్టులు చేశారని,   తర్వాత పేషెంట్ హెల్త్ కండిషన్, రిపోర్టుల వివరాలు చెప్పేందుకు ప్రయత్నించారని అంటున్నారు. కానీ, మౌనిక ఫోన్​లో మాట్లాడుతుండడంతో  డాక్టర్ ఆమెను వారించారు. వినకపోవడంతో మందలించారు. 

డాక్టర్​పై దాడి

దీంతో మౌనిక డాక్టర్ మాటలను ఫోన్​లో రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. దీంతో డాక్టర్​ఆమె ఫోన్ లాక్కుని అక్కడే ఉన్న నర్సుకు ఇచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఆమె డాక్టర్ శివశంకర్​పై  దాడి చేశారు. ఈ గొడవలో డాక్టర్ కండ్లద్దాలు  పగిలిపోయాయి.  నుదుటిపై గాయమై రక్తం వచ్చింది. పక్కనే ఉన్న ఇతర డ్యూటీ డాక్టర్లు, సిబ్బంది ఆమెను నిలువరించేందుకు ప్రయత్నించగా  దూషించింది. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో చిలకలగూడ పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జూడాల ఆందోళన.. సేవలకు అంతరాయం 

ఈ దాడిని నిరసిస్తూ సోమవారం ఉదయం జూడాలు అత్యవసర సేవలు మినహా మిగిలిన విధులను బహిష్కరించి హాస్పిటల్​ మెయిన్ బిల్డింగ్ ఎదుట బైఠాయించారు. ప్లకార్డులు చేతబూని ప్రభుత్వానికి, గాంధీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. హాస్పిటల్లో భద్రతా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని, అత్యవసర, సమస్యాత్మక ప్రాంతాల్లో కనీసం సీసీ కెమెరాలు కూడా సరిగ్గా లేవని ఆరోపించారు. 

జూడాల ఆందోళనతో వైద్య సేవలకు అంతరాయం కలగడంతో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) నరేందర్ కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి, చిలకలగూడ ఇన్​స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణ జూడాల సంఘ ప్రతినిధులతో అత్యవసర చర్చలు జరిపారు.  ఆసుపత్రిలో భద్రతను కట్టుదిట్టం చేస్తామని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం జూడాలు తిరిగి విధుల్లో చేరారు. కాగా, దాడి ఘటనను హెచ్‌ఆర్‌డీఏ, టీజీజీడీఏ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.