స్వదేశానికి ఎన్టీఆర్.. అభిమానుల ఘన స్వాగతం

స్వదేశానికి ఎన్టీఆర్.. అభిమానుల ఘన స్వాగతం

మార్చి 12న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ‘ఆస్కార్‌’ అవార్డ్స్ వేడుకకు దేశం తరపు నుంచి వెళ్లిన ఆర్ఆర్ఆర్ మూవీ టీం ఒక్కొక్కరుగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ (మార్చి15న) ఇయ్యాళ ఉదయం 3 గంటలకు శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అత్యున్నతమైన ఆస్కార్ అవార్డుతో దేశానికి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ కు ఆయన ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సినీ రచయిత చంద్రబోస్ లు స్టేజ్ పై ఆస్కార్ అవార్డు అందుకోవడం తనకు ది బెస్ట్ మూమెంట్ అని జూనియర్ టైగర్ ఆనందం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆస్కార్ అందుకోగానే మీకెలా అనిపించిందన్న మీడియా రిపోర్టర్లకు ఎన్టీఆర్ చెప్పిన సమాధానం అందర్నీ ఆకర్షించింది. ఆస్కార్ చాలా బరువుగా ఉందని, తన దేశం ఎంత బరువుందో ఆస్కార్ అందుకున్నపుడు కూడా అలాగే అనిపించిందని చెప్పారు. తనకు గర్వంగా ఉందని, అవార్డు అందుకున్నపుడు ఇంకా ఎక్కువ గర్వంగా అనిపించిందని ఎన్టీఆర్ అన్నారు. అది మాటల్లో చెప్పలేనిదని, ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. భారతీయుడిని.. అందులోనూ తెలుగువాడిని అయినందుకు గర్వపడుతున్నాన్న ఎన్టీఆర్.. తాము ఇంతటి గౌరవాన్ని  దక్కించుకున్నామంటే దానికి కారణం అభిమానులు, సినీ ప్రియులు. వాళ్ల ప్రేమ, ఆశీస్సుల వల్లే ఈ అవార్డు సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు.