ఒక్కటవుతున్నపంచాయతీ సెక్రటరీలు

ఒక్కటవుతున్నపంచాయతీ సెక్రటరీలు
  •  ఇప్పటికే ఆరు జిల్లాల్లో కమిటీలు
  •  ‘యాక్షన్‌‌ ప్లాన్‌‌’ తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు

హైదరాబాద్‌‌, వెలుగు: ఉద్యోగ భద్రత, హక్కుల సాధనతోపాటు విధి నిర్వహణలో ఎదురవుతున్న ఒత్తిళ్లను అధిగమించేందుకు జూనియర్‌‌ పంచాయతీ కార్యదర్శులు ఏకమవుతున్నారు. పని ఒత్తిడి భరించలేక నాగర్‌‌ కర్నూల్‌‌ జిల్లాలో కార్యదర్శి స్రవంతి ఆత్మహత్యకు పాల్పడ్డ నేపథ్యంలో.. సెక్రటరీలందరూ సంఘటితమవుతున్నారు. ఇప్పటికే రోడ్డెక్కిన కార్యదర్శులంతా కలిసి సంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

స్రవంతి ఆత్మహత్యతో..

ఒకవైపు సస్పెన్షన్ల వివాదాస్పదం అవుతుండగానే.. పని ఒత్తిడి భరించలేక ఈనెల 14న నాగర్‌‌ కర్నూల్‌‌ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని గుమ్మకొండ  పంచాయతీ కార్యదర్శి స్రవంతి ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్రవంతి ఆత్మహత్య ఘటనతో కలతచెందిన కార్యదర్శులు రోడ్డెక్కారు. తమపై పని ఒత్తిడి తగ్గించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, స్రవంతి కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్‌‌తో అన్ని జిల్లాల్లో వందలాది మంది రోడ్డెక్కారు. ఈ నిరసన వేదికగానే ఓం సంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సీనియర్‌‌ పంచాయతీ కార్యదర్శులతో కలిసి ఆరు జిల్లాల్లో కమిటీలను ఎన్నుకున్నారు. వచ్చే వారం రోజుల్లో అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో కమిటీలు వేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. గ్రామాల్లో అమలవుతున్న 30 రోజుల యాక్షన్‌‌ ప్లాన్‌‌ పూర్తయిన తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

డీపీఓల హెచ్చరికలు..

ఓ వైపు గ్రామాల్లో యాక్షన్‌‌ ప్లాన్‌‌ అమలు చేస్తుండగా, మరోవైపు స్రవంతి ఆత్మహత్యపై కార్యదర్శులు రోడ్డెక్కడం, కలెక్టరేట్లను ముట్టడించడంపై పలు జిల్లాల్లో డిస్ట్రిక్ట్‌‌ పంచాయతీ ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉద్యోగంలో చేరేటప్పుడు కార్యదర్శులు రాసిచ్చిన బాండ్‌‌లో అనేక రూల్స్‌‌ ఉన్నాయని, ఆందోళనలు చేయడం, సంఘాల ఏర్పాటు, యూనియన్లలో చేరడం నిబంధనలకు విరుద్ధమని వారు హెచ్చరించినట్లు సమాచారం. అయితే జూనియర్‌‌ కార్యదర్శులు మాత్రం సంఘాలు పెట్టుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, బాండెడ్‌‌ లేబర్లుగా పనిచేయించుకోవడం సరికాదని వాదిస్తున్నారు.

మార్కులు.. సస్పెన్షన్లు..

రాష్ట్రంలో 12,753 గ్రామపంచాయతీలు ఉండగా, ఇందులో సుమారు 1,100  జీపీలకు మినహా మిగతా గ్రామాల్లో జూనియర్‌‌ కార్యదర్శులతోపాటు, గ్రేడ్‌‌ 1, 2, 3 పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామాల్లో 32 రకాల పనులను రెగ్యులర్‌‌గా నిర్వహిస్తూ డేటాను ఎప్పటికప్పుడు ఆన్‌‌లైన్‌‌ చేయాల్సి ఉంటుంది. ఈ డేటా ఆధారంగా వారి ఫర్మామెన్స్‌‌కు ప్రభుత్వం మార్కులిస్తోంది. హరితహారంలో వెనకబడ్డారని ఇటీవల పలువురు కార్యదర్శులపై కలెక్టర్లు సస్పెన్షన్‌‌ వేటు వేశారు.