ISS లో పరిశోధనలు పూర్తయ్యాయి..రేపు(జూలై14) భూమిపైకి శుభాన్షు శుక్లా

ISS లో పరిశోధనలు పూర్తయ్యాయి..రేపు(జూలై14) భూమిపైకి శుభాన్షు శుక్లా

రెండు వారాల పరిశోధనల అనంతరం భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సోమవారం (జూలై14) తిరిగి భూమిపైకి రానున్నారు. ఆక్సియం-4 మిషన్ సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ప్రయోగాలు,పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి భూమికి రానున్నారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ISS నుండి ఆక్సియం మిషన్ 4 అన్‌డాకింగ్ కు షెడ్యూల్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు కాలిఫోర్నియా తీరంలో భూమిపై స్ప్లాష్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. 

ఆక్సియం 4 మిషన్  జూన్ 25, 2025న ప్రయోగించబడింది. వాస్తవానికి ఈ ప్రయోగం మే 29, 2025న జరగాల్సి ఉండగా, ఫాల్కన్ 9 రాకెట్‌లో ద్రవ-ఆక్సిజన్ లీకేజీ ,అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోని జ్వెజ్డా సర్వీస్ మాడ్యూల్‌లో లీకేజీ వంటి సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు వాయిదా పడింది. 

వివిధ దేశాల మధ్య అంతరిక్ష పరిశోధనలో సహకారాన్ని బలోపేతం,ఈ మిషన్‌లో భారత్, పోలాండ్, హంగేరీ ప్రభుత్వాలు భాగస్వామ్యం అయ్యాయి.
ఈ మిషన్ లో భాగంగా నలుగురు వ్యోమగాములు ISS లోకి వెళ్లారు. నాసా మాజీ వ్యోమగామి మిషన్ కమాండర్ పెగ్గి విట్సన్, భారత్ కు చెందిన పైలట్ శుభాంశు శుక్లా, పోలండ్ వ్యోమగామి స్లావోష్ ఉజ్నాన్స్కీ-విస్నివెస్కీ,  హంగేరి వ్యోమగామి తిబోర్ కాపూలు రెండు వారాల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బస చేసి పరిశోధనలు చేశారు. 

ఏం పరిశోధనలు చేశారు.. 

ఆక్సియం-4 మిషన్ ఇప్పటివరకు జరిగిన ప్రైవేట్ అంతరిక్షయానాలలో అత్యంత విస్తృతమైన పరిశోధనలను నిర్వహించింది. అంతరిక్ష ఔషధం, న్యూరోసైన్స్, వ్యవసాయం, మెటీరియల్స్ సైన్స్ ,పర్యావరణ పర్యవేక్షణ వంటి రంగాలలో 60కి పైగా ప్రయోగాలు చేశారు.

శుభాంశు శుక్లా ఈ మిషన్‌లో కీలక పాత్ర పోషించారు.ముఖ్యంగా భారత్ నేతృత్వంలోని స్పేస్ ఫార్మింగ్ ప్రాజెక్టులలో భాగంగా మూంగ్ ,మెంతి విత్తనాలను మొలకెత్తించడం, మైక్రోఅల్గేను సాగు చేయడం వంటివాటిపై పరిశోధనలు చేశారు. ఈ ప్రయోగాలు భవిష్యత్ అంతరిక్ష మిషన్ల కోసం మానవ జీవన వ్యవస్థలను మెరుగు పర్చే లక్ష్యంతో ప్రయోగాలు జరిగాయి. 

ఈ మిషన్ అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం, వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడం, భవిష్యత్తులో గగన్‌యాన్ వంటి భారత అంతరిక్ష మిషన్లకు తోడ్పాటునందించనుంది.