
ప్రముఖ మరాఠీ నటి ప్రియా మరాఠే (Priya Marathe) కన్నుమూశారు. ఇవాళ ఆదివారం (ఆగస్టు 31న) ఉదయం ముంబైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. గత రెండున్నర సంవత్సరాలుగా నటి ప్రియా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఆమె కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ఇచ్చి, ట్రీట్ మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత క్యాన్సర్ తగ్గిందని తిరిగి ఎంట్రీ ఇవ్వడానికి విదేశాలకు వెళ్లింది.
గత కొన్ని నెలలుగా, వ్యాధి మళ్ళీ ముదరడంతో చికిత్స పొందుతూ ఇవాళ ఆమె కన్నుమూశారు. కేవలం 38 సంవత్సరాల వయసులోనే వ్యాధి కారణంగా ఆమె మరణించడంతో, కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలో ఆమె మృతి పట్ల సినీ, టెలివిజన్ పరిశ్రమ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
నటి ప్రియా మరాఠే దాదాపు 20కి పైగా టీవీ సీరియల్లో, 2 సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. దివంగత హీరో సుశాంత్ సింగ్తో ఆమె కలిసి నటించిన 'పవిత్ర రిస్తా' అనే సీరియల్తో మంచి గుర్తింపు దక్కించుకుంది.
ప్రియా మరాఠే:
ప్రియా మరాఠే 1987 ఏప్రిల్ 23న మహారాష్ట్రలోని థానేలో జన్మించారు. 2005లో 'యా సుఖ్నో యా' అనే మరాఠీ సీరియల్ ద్వారా బుల్లితెరపై అరంగేట్రం చేసింది. ఆ తర్వాత, 'చార్ దివాస్ ససుచే', 'తు తిథే మీ', 'తుఝేచ్ మీ గీత్ గాత్ ఆహే' వంటి సీరియల్స్‌లో ఆమె పోషించిన బలమైన పాత్రలు మంచి పేరు తీసుకొచ్చాయి.
ఆ తర్వాత హిందీ సీరియల్స్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది. 'కసమ్ సే' సీరియల్‌లోని 'విద్యా బాలి' పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం 'పవిత్ర రిష్ట'లోని 'వర్ష' మరియు 'బడే అచ్చే లగ్తే హై'లోని 'జ్యోతి మల్హోత్రా' పాత్రలతో మరింత చేరువైంది.