
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీనేత గోపాల్ సమంత్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాయ్‌పూర్‌లోని మానా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
మహువా మొయిత్రా ఏమందంటే..
పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో గురువారం జరిగిన ఓకార్యక్రమంలో మహువా మొయిత్రా విలేకరులతో మాట్లాడుతూ..బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను నిరోధించడంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విఫలమైతే..అమిత్ షా తలను నరికి టేబుల్‌పై పెట్టాలి అని అన్నారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయి.
మహువా మొయిత్రా వ్యాఖ్యలు జాతి, మతం, జన్మస్థలం వంటి కారణాలతో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతాయని,జాతీయ సమైక్యతకు భంగం కలిగించేలా ఉన్నాయని పోలీసులు తెలిపారు. అందుకే భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 196 ,197 కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యలు రాయ్‌పూర్‌లోని మానా క్యాంప్‌లో నివసిస్తున్న బంగ్లాదేశీ శరణార్థులలో భయాన్ని, ఆందోళనను పెంచుతాయని కూడా పోలీసులు పేర్కొన్నారు.