గణేష్ పండగ అంటే.. భారీ విగ్రహాలు డీజేలు కాదు.. వీళ్లది కదా భక్తి అంటే.. ?

గణేష్ పండగ అంటే.. భారీ విగ్రహాలు డీజేలు కాదు.. వీళ్లది కదా భక్తి అంటే.. ?

మట్టి విగ్రహాలను ప్రతిష్ఠిస్తే పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగదని అందరికీ తెలుసు. కానీ.. ఎంతమంది పాటిస్తున్నారు? గల్లీకో ప్లాస్టర్ ఆఫ్​ ప్యారీస్‌‌ విగ్రహం ఏర్పాటు చేసి, డీజే పాటలు మోగిస్తున్నారు. కానీ.. ఇక్కడ మాత్రం ఊరు మొత్తానికి ఒకే మండపం.. ఒకే మాట. 70 ఏండ్లుగా ఇక్కడ మట్టి గణపయ్యనే ప్రతిష్ఠిస్తున్నారు. ఊరంతా కలిసి ఏండ్ల నాటి వాయిద్యాలు మోగిస్తూ, భజనలు చేసి.. ప్రతిష్ఠించిన రెండో రోజే నిమజ్జనం చేస్తున్నారు.

ఊళ్లో పది మండపాలు ఏర్పాటు చేస్తే.. వాటిలో ఒకట్రెండు మట్టి విగ్రహాలు కూడా కనిపించవు. అన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌‌తో చేసినవే. పైగా ఒకరికి పోటీగా మరొకరు విగ్రహాల ఎత్తుని పెంచుతూ పోతున్నారు. కానీ.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని లేండిజాల గ్రామస్తులు 70 ఏళ్లుగా మట్టిగణపతికే ‘జై’ కొడుతున్నారు. అందులోనూ మూడు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఎత్తు ముఖ్యం కాదు భక్తే ముఖ్యమని చాటి చెప్తున్నారు. చుట్టు పక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ గ్రామంలో 135 ఆదివాసీ రైతు కుటుంబాలు ఉన్నాయి. 

అందరూ కలిసి ప్రతి ఏడాది ఒకే మండపంలో గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. వాళ్ల పూర్వీకులు వీధి వీధికీ.. ఎవరికి వాళ్లు ఉత్సవాలు చేసుకునే విధానం తమ గ్రామంలో ఉండకూడదు అనుకున్నారు. అందుకే 70 ఏండ్ల క్రితం ఊరంతా కలిసి ఒకే మండపాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పైగా అప్పుడే పర్యావరణానికి హాని చేసే విగ్రహాలకు దూరంగా ఉండాలని తీర్మానం చేశారు. అప్పటినుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. వినాయకచవితినాడు ప్రతిష్ఠించిన విగ్రహాన్ని ఆ మరుసటి రోజే నిమజ్జనం చేస్తారు. ఒకే రోజులో అన్ని పూజలు పూర్తిచేస్తారు. మొక్కులు తీర్చుకుంటారు. ఈ రెండు రోజులు స్వచ్ఛందంగా అందరూ ఆల్కహాల్, మాంసానికి దూరంగా ఉంటారు. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. 

వాయిద్యాలతో భజనలు

అందరూ బ్యాండ్, క్యాషియో, డీజేల మోతలు మోగిస్తున్నా.. లేండిజాల గ్రామస్తులు మాత్రం పాత సంప్రదాయ వాయిద్యాలనే వాయిస్తున్నారు. భక్తి గీతాలు పాడుతూ రాత్రంతా జాగరణ చేస్తుంటారు. భజన కార్యక్రమంలో ప్రధానంగా సంత్ తుకుడోజీ మహారాజ్ గీతాలు పాడతారు. 50 ఏళ్ల క్రితం కొన్న వాయిద్యాలనే ఇప్పటికీ వాడుతున్నారు. అప్పట్లో తబలాను రూ. 30, హార్మోనియం రూ. 60కు కొన్నారు. వినాయక నిమజ్జనం తర్వాత వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తారు. గణేష్ ఉత్సవాలప్పుడు ఎనిమిది భజన బృందాలు లేండిజాలకు వస్తుంటాయి. గ్రామస్తులు శ్రావణ మాసంలో కూడా ప్రతిరోజూ రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. యువతలో సంగీతంపై ఆసక్తిని పెంచుతున్నారు. 

మా పూర్వీకుల బాటలో.. 

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు అందంగా కనిపించినా పర్యావరణానికి హానికరం అనే విషయాన్ని మా పూర్వీకులు ముందుగానే గ్రహించారు. అందుకే మట్టి గణపతితో ఉత్సవాలు జరుపుకోవడమే మంచిదని సూచించారు. మేమూ అదే ఆచారం ఇప్పటికీ పాటిస్తున్నాం. మా ముందుతరాలకు కూడా ఇదే సంప్రదాయం నేర్పుతున్నాం.  – మెస్రం బాదిపటేల్ లేండిజాల 

గోధుమపిండితో మొదలై.. 

లేండిజాలలో గణేష్ ఉత్సవాలకు ఏండ్ల నాటి చరిత్ర ఉంది. తొలినాళ్లలో గ్రామస్తులు గోధుమపిండితో విగ్రహం చేసి, పూజించేవాళ్లు. ఆ తర్వాత మట్టితో తయారు చేయడం మొదలుపెట్టారు. కాలక్రమేణా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక్‌‌నగర్‌‌కు చెందిన శిల్పకారుడు వేణుగోపాల్ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. మొదట్లో వేణుగోపాల్ తండ్రి మట్టిమూర్తులు చేసేవాడు. 50 ఏండ్లుగా వాళ్లే విగ్రహాలు చేసి ఇస్తున్నారు. గతంతో పోలిస్తే విగ్రహాల ధరలు చాలా పెరిగినా లేండిజాల గ్రామస్తులకు ప్రత్యేకంగా రాయితీ ఇస్తున్నారు. మూడు అడుగుల విగ్రహానికి కేవలం ఐదు నుంచి ఆరు  వేల రూపాయలే తీసుకుంటారు.