12 ఏళ్లకే సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈవో

12 ఏళ్లకే సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈవో

పిల్లల్ని కేవలం చదువు, మార్కులకే పరిమితం చేయడం సరికాదు. వాళ్లకేది ఇష్టమో అది గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధించగలరని నిరూపిస్తోంది జునైరా ఖాన్. పన్నెండేళ్ల చిన్నారి ఏకంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి, సీఈఓగా పని చేస్తోంది. తల్లిప్రోత్సాహంతో చిన్న వయసులోనే కంపెనీ పెట్టి రాణిస్తోంది.


ఏడేళ్లకే
కోడింగ్ 

ఇంజనీరింగ్​ పూర్తి చేసిన చాలా మంది కల సాఫ్ట్​వేర్​ ఉద్యోగం. ఏదైనా కంపెనీలో ఉద్యోగం దొరికితే చాలు ఆనందపడిపోతారు. వాళ్లలో కొందరు కొన్నేళ్ల అనుభవం తర్వాత సొంతంగా కంపెనీ పెడతారు. దీనికి చాలా ప్రతిభ, అనుభవం కావాలి. కానీ, ఈ స్థాయిని పన్నెండేళ్లకే చేరుకుంది హైదరాబాద్​కు చెందిన జునైరా ఖాన్. ఈ వయసు పిల్లలు చదువు, ఆటపాటలకే పరిమితమైతే తను మాత్రం లక్ష్య సాధన దిశగా అడుగులేస్తోంది. చిన్న వయసులోనే వివిధ సంస్థలకు సేవలందిస్తూ రాణిస్తోంది.

జునైరా.. హైదరాబాద్​లోని నాచారం ప్రాంతానికి చెందిన ‘ఢిల్లీ పబ్లిక్​ స్కూల్’లో చదువుకుంటోంది. ఆమె తల్లి ఇంజనీరింగ్  విద్యార్థులకు సాఫ్ట్​వేర్​ పాఠాలు చెప్తుంది. అయితే బీటెక్​లో స్టూడెంట్స్​కు చెప్పే కంప్యూటర్​ పాఠాలు తనకూ చెప్పమని పట్టుపట్టింది జునైరా. దీంతో చిన్నప్పట్నుంచే జునైరాకు సాఫ్ట్​వేర్​లో కొన్ని కోర్సులపై ట్రైనింగ్​ ఇచ్చింది. తల్లి ప్రోత్సాహంతో ఏడేళ్ల వయసులోనే కోడింగ్, వెబ్​ డెవలప్​మెంట్​ వంటివి నేర్చుకుంది. ‘హెచ్​టీఎమ్​ఎల్, సీఎస్​ఎస్,  పీహెచ్​పీ, జావా’ వంటి ఏరియాల్లో మంచి పట్టు సాధించింది. ​దీంతో ఎనిమిదేళ్ల వయసులోనే సొంతంగా ఒక వెబ్​ డెవలప్​ చేసింది.

మూడు గంటల ప్రాక్టీస్

ప్రతి రోజూ స్కూల్​ నుంచి ఇంటికి రాగానే సాఫ్ట్​వేర్ కంపెనీ, యాప్​ డెవలప్​మెంట్​ కోసం మూడు గంటలు కేటాయిస్తుంది. జునైరా ఈ కామర్స్​ సైట్లపైనా మంచి పట్టుంది. ఇప్పటికే తనకున్న ప్రతిభతో యాప్​ డెవలప్​ చేసి ‘జీఎస్​ బిజ్​కార్ట్​ క్లోతింగ్స్’ వంటి పలు సంస్థలకు యాప్, వెబ్​ డెవలప్​ చేసి అందించింది.

సొంతంగా కంపెనీ

యాప్స్, వెబ్ సైట్లు డెవలప్​ చేయడం వచ్చాక ‘జడ్​ఎమ్​ ఇన్ఫోకామ్’ అనే సంస్థను స్థాపించి, దానికి ‘సీఈఓ’గా కొనసాగుతోంది. కొన్ని సంస్థలకు యాప్​ డెవలప్​ చేసి అందిస్తుంది ఈ కంపెనీ.  ‘జడ్​ఎమ్​ ఇన్ఫోకామ్’ అందిస్తున్న సేవలపై క్లయింట్లు కూడా  సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వివిధ సంస్థలకు చెందిన టీమ్​ మేనేజ్​మెంట్లకు ఉపయోగపడేలా యాప్​ డెవలప్​ చేస్తున్నట్లు జునైరా తెలిపింది. ఈ యాప్​ ద్వారానే ఉద్యోగులకు టాస్కులు, అసైన్​మెంట్లు ఇవ్వొచ్చని చెప్పింది. బీటెక్​ విద్యార్థులకు కోడింగ్​కు సంబంధించి అప్పుడప్పుడూ పాఠాలు కూడా చెప్తున్నట్లు వివరించింది జునైరా.