- మద్యం విక్రయాలపై ప్రతిపక్షాల ఆరోపణలు విడ్డూరం: జూపల్లి
హైదరాబాద్, వెలుగు: గిరిజన ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఇప్ప సుర అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇప్పసారా తయారీ, దాని ప్రభావంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామన్నారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా పెరిగాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని మంత్రి మండిపడ్డారు. శాసనసభలో పర్యాటక, పురావస్తు, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల పద్దులపై జరిగిన చర్చలో మంత్రి సమాధానమిచ్చారు.
రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదిలో ఎక్సైజ్ శాఖ ఆదాయం కేవలం రూ. 10,012 కోట్లు మాత్రమే ఉండగా, గత ప్రభుత్వ పదేండ్ల పాలన ముగిసే సమయానికి ఏకంగా రూ. 34,869 కోట్లకు చేరిందని మంత్రి గుర్తు చేశారు. గతేడాదిలోనే ఆదాయం రూ.2,762 కోట్లు (సుమారు 27.6%) పెరిగిందన్నారు. రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని జూపల్లి తెలిపారు. గతంలో అక్రమ మద్యంపై 11,867 కేసులు నమోదు కాగా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆ సంఖ్య 18,500కు చేరిందన్నారు.
