నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్​కు పర్మిషన్: జూపల్లి

నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్​కు పర్మిషన్: జూపల్లి
  •     మద్యం సప్లై అనుమతుల్లో రూల్స్ పాటించాం: జూపల్లి
  •     ఇప్పుడున్న ప్రొసీజర్ ప్రకారమే ముందుకెళ్తున్నం
  •     బీఆర్ఎస్ హయాంలో 33 బీర్ బ్రాండ్లకు పర్మిషన్ ఇచ్చారన్న ఎక్సైజ్ మంత్రి 

హైద‌‌‌‌రాబాద్, వెలుగు: నియమ నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ఉత్పత్తులను సరఫరా చేసేందుకు తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ అనుమతి ఇచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎలాంటి అప్లికేషన్లు రాలేవని తెలిపారు. గతంలో నిర్వహించిన ప్రెస్​మీట్​లో కూడా తాను ఇదే విషయం చెప్పినట్టు గుర్తు చేశారు. అనుమతులతో పాటు ఇతర ఏ అంశాలకు సంబంధించిన ఫైల్స్ తన వద్దకు రాలేవన్నారు. ఇప్పుడు ఉన్న ప్రొసీజర్ ప్రకారం ఏ నిర్ణయం అయినా తీసుకునే అధికారం బేవరేజ్ కార్పొరేషన్​కు ఉందని మంగళవారం రిలీజ్ చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలోనే సోమ్ డిస్టిలరీస్​కు తమ ఉత్పత్తుల సప్లైకు అనుమతిచ్చారని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో హోల్​సేల్ మద్యం సప్లై, కొత్త బ్రాండ్లకు పర్మిషన్ ఇచ్చే ప్రక్రియ అంతా తెలంగాణ బేవరేజ్​కార్పొరేషన్ చూసుకుంటుందని పేర్కొన్నారు. డిమాండ్, సప్లైను బట్టి కొత్త కంపెనీలకు అనుమతులు మంజూరు చేస్తుందని తెలిపారు.

రెండు దశాబ్దాలుగా సోమ్ డిస్టిలరీస్ తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నదని, దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల్లోని ఐఎంఎఫ్ఎల్ సప్లయర్​గా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న ఎక్సైజ్ పాలసీ ప్రకారమే బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ.. సోమ్ డిస్టిలరీస్​తో పాటు ఇతర కంపెనీలకు మద్యం సప్లైకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఎక్కడ కూడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగేండ్ల కింద కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 2020–21లో 50 లిక్కర్ బ్రాండ్లు, ఐదు బీర్ బ్రాండ్ల కంపెనీలకు, 2021–22లో 75 లిక్కర్ బ్రాండ్లు, 8 బీర్ బ్రాండ్ల కంపెనీలకు, 2022–23లో 122 లిక్కర్ బ్రాండ్లు, 11 బీర్ బ్రాండ్ల కంపెనీలకు, 2023–24లో 41 లిక్కర్ బ్రాండ్లు, 9 బీర్ బ్రాండ్ల కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చిందని తెలిపారు. గతంలో కూడా బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్తగా మద్యం కంపెనీలకు ఇలాగే అనుమతులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ ప్రొసీజర్ ప్రకారమే తాము అప్రూవల్ ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం లిక్కర్, బీర్ల తయారీ సప్లై చైన్​ను 97.44 శాతం విదేశీ కంపెనీలే ఆక్రమించాయని గుర్తు చేశారు. మన దేశానికి చెందిన సోమ్ డిస్టిలరీకి మద్యం సప్లైకు పర్మిషన్ ఇవ్వడాన్ని బీఆర్ఎస్ లీడర్లు రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు.