ప్రధాని మోదీని కలిసిన ఆర్. కృష్ణయ్య, బీసీ సంఘాల నేతలు

ప్రధాని మోదీని కలిసిన  ఆర్. కృష్ణయ్య, బీసీ సంఘాల నేతలు

న్యూఢిల్లీ, వెలుగు: బీసీల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జోక్యం చేసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ కుల వృత్తులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు. జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయం చేయాలన్నారు. గురువారం పార్లమెంట్​లో బీసీ సంఘాల నేతలతో కలిసి ఆర్.కృష్ణయ్య ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. 

75 ఏండ్ల ఇండిపెండెంట్ ఇండియాలో బీసీలకు ఏ రంగంలోనూ జనాభా ప్రకారం వాటా దక్కలేదన్నారు. బీసీలంటే ఉత్పత్తి కులాలుగా మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపద సృష్టిస్తున్నా.. దాన్ని అనుభవించే హక్కు మాత్రం వారికి దక్కడం లేదన్నారు. పన్నుల రూపంలో దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నా.. బడ్జెట్​లోనూ అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. ఓట్లు వేసి అధికారం ఇస్తున్నా.. అధికారంలో వాటా పొందలేకపోతున్నారన్నారు. 

జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు రాజకీయ రంగంలో 14 శాతం, ఉద్యోగ రంగంలో 9 శాతం, పారిశ్రామిక రంగంలో ఒక శాతం, ప్రైవేట్ రంగంలోని ఉద్యోగాల్లో 5 శాతం కూడా లేదని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్​లలో రిజర్వేషన్లు పెట్టకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. జనగణనలో కులాల వారీగా లెక్కించాలనే పలు డిమాండ్​లు ప్రధాని ముందు ఉంచామని తెలిపారు. తమ విజ్ఞ ప్తులపై మోదీ సానుకూలంగా స్పందించారన్నారు.