
- సుప్రీం ఆదేశాలతో కొత్త చైర్మన్‌ను నియమించిన రాష్ట్ర సర్కార్
- సుప్రీం న్యాయమూర్తిగా, ఉమ్మడి హైకోర్టు సీజేగా పని చేసిన లోకూర్
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మదన్ భీంరావు లోకూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. లోకూర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ నరసింహా రెడ్డి స్థానంలో పవర్ కమిషన్ చైర్మన్‌గా లోకూర్ వ్యవహరిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఆయన విచారణ జరపనున్నారు.
చత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాల ఒప్పందాలపై న్యాయ విచారణ జరపడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలుత జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్‌ను నియమించింది. అయితే, ఈ అంశానికి సంబంధించి విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయన నోటీసులు ఇచ్చారు. విచారణ కమిషన్ ఏర్పాటుతో పాటు కమిషన్ చైర్మన్ ప్రెస్ తో మాట్లాడడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ చేపట్టిన హైకోర్టు.. కేసీఆర్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై సుప్రీంకోర్టు సీజే జస్టిస్ చంద్రదూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. జ్యుడీషియల్ కమిషన్‌ను రద్దు చేయలేమని పేర్కొంటూ.. ప్రెస్ మీట్ పెట్టారనే ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ నరసింహా రెడ్డిని కమిషన్ చైర్మన్ నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీంతో జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి తన చైర్మన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు సుప్రీంకోర్టుకు లెటర్ పంపారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు కొత్త చైర్మన్ ను నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం భీంరావు లోకూర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నాలుగున్నర దశాబ్దాలకు పైగా అనుభవం
1977లో ఢిల్లీ వర్సిటీ నుంచి ఎల్ఎల్ బీ డిగ్రీ పట్టా పొందిన జస్టిస్లోకూర్.. సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులో అడ్వకేట్‌గా పనిచేశారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, రెవెన్యూ, సేవల చట్టాల్లో లోకూర్‌కు అపారమైన అనుభవం ఉంది. 1998 జులై 14న అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 1999 ఫిబ్రవరి 19న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తి అయ్యారు.
అదే యేడు జులై 5న ఢిల్లీ హైకోర్టు శాశ్వత న్యామూర్తిగా నియమితులయ్యారు. 2010 ఫిబ్రవరి 13 నుంచి మే 21 వరకు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2011లో ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2012 జూన్ 4న సుప్రీంకోర్టు నాయమూర్తిగా నియమితులయ్యారు.