హైకోర్టు న్యాయమూర్తిగా  జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య ప్రమాణం

హైకోర్టు న్యాయమూర్తిగా  జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య ప్రమాణం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య గురువారం ప్రమాణం చేశారు. ఫస్ట్‌ కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆమెతో చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య కలకత్తా హైకోర్టు నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు ఆమెను బదిలీ చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఆదేశాలను రిజిస్ట్రార్‌ జనరల్‌ చదివి వినిపించారు.

జస్టిస్‌ మౌసమీ 1967 అక్టోబరు 27న పుట్టారు. కలకత్తాలో చదివారు. జాదవ్‌పూర్ విశ్వ విద్యాలయంలో బీఏ, కలకత్తా యూనివర్సిటీలో లా, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 2017 సెప్టెంబరు 21న కలకత్తా హైకోర్టు అదనపు జడ్జిగా, 2019 సెప్టెంబరు 16న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.