- సక్సెస్ చేయాలని డీజీపీ, కమిషనర్లకు జస్టిస్ శ్యాంకోశీ సూచన
హైదరాబాద్, వెలుగు: కోర్టుల్లో పెండింగ్ ఉన్న కాంపౌండబుల్ క్రిమినల్ కేసుల పరిష్కారానికి సహకరించాలని పోలీసులకు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.శ్యాంకోశీ సూచించారు. ప్రధాన న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ సూచనలతో నవంబరు 15న ప్రత్యేక లోక్‌అదాలత్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నిర్వహిస్తున్నామని, దీన్ని విజయవంతం చేయడానికి తగిన సహాయ సహకారాలు అందించాలన్నారు. మంగళవారం డీజీపీ బి.శివధర్‌రెడ్డి, అదనపు డీజీపీలు మహేశ్ భగవత్, చారు సిన్హాలతోపాటు సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు, హైదరాబాద్ జాయింట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లతో లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో జస్టిస్ శ్యాంకోశీ సమావేశమయ్యారు.
జరిమానా విధించదగ్గ చిన్న చిన్న క్రిమినల్ కేసులతోపాటు చెక్‌బౌన్స్ కేసుల పరిష్కారానికి సహకరించాలని సూచించారు. చిన్న చిన్న కేసులతో కోర్టులపై భారం ఎక్కువగా ఉందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.
దీనిపై డీజీపీ స్పందిస్తూ.. కోర్టుల్లో పెండింగ్ ఉన్న కాంపౌండబుల్ కేసులను పరిష్కారానికి సహకారం అందిస్తామన్నారు. ప్రత్యేక లోక్‌అదాలత్ విజయవంతానికి సహకరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి సీహెచ్.పంచాక్షరి, పరిపాలన అధికారి ఎం.రాజు తదితరులు పాల్గొన్నారు.
