పంజాగుట్ట, వెలుగు: తెలంగాణ సాధనలో ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ పాత్ర కీలకమైందని, ఆయన సేవలకు గుర్తుగా ట్యాంక్ బండ్పై జాదవ్ విగ్రహం ప్రతిష్టించాలని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కోరారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు ఆయన దిక్సూచిగా మారి ఉద్యమించారని గుర్తు చేశారు. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నుంచి ముల్కి ఉద్యమంతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన ఉద్యమకారులకు పెద్దన్నగా మారారన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రజా సంఘాలు, లోహియా విచార్ మంచ్, తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితి సంయుక్తంగా కేశవరావు జాదవ్ 93వ జయంతిని మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డితో పాటు జస్టిస్ చంద్రకుమార్, విమలక్క, పాశం యాదగిరి, ప్రొ.సింహాద్రి, నారగోని, మన్నారం నాగరాజు, జర్నలిస్టు విఠల్, ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ రాంరెడ్డి సుభద్రారెడ్డి, దిలీప్‌కుమార్, దూసరి రాజుగౌడ్ పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ గత ప్రభుత్వం కేశవరావును విస్మరించిందని, ప్రజాప్రభుత్వం ఆయన సేవలకు గుర్తుగా పాఠ్యంశాల్లో ఆయన చరిత్రను ముద్రించి సముచిత స్థానం ఇవ్వాలని కోరారు. తెలంగాణ పోరాటం కోసం తన స్థిర, చరాస్తులను త్యాగం చేశారని గుర్తుచేసుకున్నారు. ఉస్మానియా యునివర్సిటీ ఇంజనీరింగ్ విభాగానికి జాదవ్ పేరుపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
