
- ఇష్టమున్నోళ్ల పేర్లు రాస్తామంటే ఎలా?.. విధి నిర్వహణలో ఈసీ విఫలం
- ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి
- దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడింది
- నేను ఏ పార్టీ సభ్యుడిని కాదు.. విమర్శిస్తే పోటీనుంచి తప్పుకుంటా అనుకున్నారు
- రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నానని వెల్లడి
- జాతీయ రాజకీయాల్లో ప్రమాదంలో తెలుగువారి మనుగడ: సీఎం రేవంత్
- సుదర్శన్ రెడ్డిని పార్టీలకతీతంగా గెలిపించుకుందామని పిలుపు
- తాజ్‌కృష్ణ హోటల్‌లో ఉప రాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమం
హైదరాబాద్, వెలుగు: దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో ఉందని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటరు జాబితాను తమ ఇష్టం వచ్చినట్లు తయారు చేసుకుంటామంటే కుదరదని అన్నారు. అలా ఇష్టమొచ్చినోళ్ల పేర్లు రాసుకునేందుకు అదేమన్నా చిత్తు కాగితమా? అని ప్రశ్నించారు. తమ ఇష్టం ఉన్న వాళ్ల పేర్లే ఓటరు లిస్టులో రాస్తామంటే ప్రజాస్వామ్యంతోపాటు ఎన్నికల ప్రక్రియే ప్రమాదంలో పడ్డట్టని చెప్పారు.
సోమవారం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో పీసీసీ ఆధ్వర్యంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, సీపీఐ నేత నారాయణ, సీపీఎం నేత జాన్ వెస్లీ, మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు గడ్డం వంశీ కృష్ణ, మల్లు రవి, రఘురామరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఏ పార్టీ అభ్యర్థిని కానని, తనకు ఏ పార్టీ సభ్యత్వం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా తాను ఏ పార్టీ సభ్యత్వం స్వీకరించబోనని చెప్పారు. తనపై కొందరు ఏవేవో నిందలు వేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై పరోక్షంగా విమర్శలు చేశారు. తనపై విమర్శలు చేస్తే ఉప రాష్ట్రపతి ఎన్నికల పోటీ నుంచి వెనక్కి తగ్గుతానని లేదా తప్పుకుంటానని కొంత మంది అనుకుంటున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు ఇంకా తాను పోటీలో ఉండాలనే బాధ్యతను పెంచాయని చెప్పారు.
తన తీర్పును విమర్శించే వారు ముందుగా దాన్ని చదవాలని సూచించారు. అయినా అది తన తీర్పు కాదని, సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పారు. తన తీర్పును 11 మంది జస్టిస్ లు చదివారని, కానీ తాను ఇచ్చిన కాపీలోని కనీసం ఒక కామా, ఫుల్ స్టాఫ్, సెమి కోలన్‌ను కూడా మార్చలేదని వెల్లడించారు. ఉప రాష్ట్రపతి అంటే రాజకీయ పదవి కాదని, రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నానని చెప్పారు.
నేను దేశంలోని మెజార్టీ ప్రజల అభ్యర్థిని
ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అడిగినప్పుడు కొంత ఇబ్బంది పడ్డానని, ఆలోచించి చెప్తానని అన్నానని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. అయితే, తాను ఇండియా కూటమి అభ్యర్థి నుంచి ప్రతిపక్షాల అభ్యర్థిగా మారిపోవడంతో ఆప్ నేత కేజ్రీవాల్ కూడా తనకు సంపూర్ణ మద్దతు తెలిపారని చెప్పారు. కొందరు తటస్థులైన ఎంపీలు కూడా తనకు ఫోన్ చేసి సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. దేశంలో ఉండే మెజార్టీ ప్రజల అభ్యర్థి అని గొప్పగా ఫీల్ అవుతున్నానని చెప్పారు.
దేశంలో ఉన్న పార్లమెంట్ సభ్యులందరికీ తనకు ఓటువేసి గెలిపించాలని లేఖలు రాశానని చెప్పారు. ఎందుకంటే తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తినని, అందరికి లేఖలు రాసే హక్కు తనకు ఉందన్నారు. దేశ పౌరుడిగా క్రమం తప్పకుండా ఎన్నికల్లో పాల్గొంటానని, పౌర సమాజం ప్రతినిధిగా.. పౌర హక్కులు, సామాజిక న్యాయం, వివిధ సమస్యలపై తాను మాట్లాడుతూనే ఉంటానని చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ విధులు నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికలు ఇప్పుడు ఫ్రీ అయ్యాయని, కాని అందులో ఫేర్ పోయిందని అన్నారు. కులం, మతం లేని జాబితా ఏదైనా ఉందంటే అది కేవలం ఓటర్ల జాబితా మాత్రమేనని తెలిపారు.
లౌకికవాద పరిరక్షణకు సుదర్శన్‌రెడ్డి గెలవాలి: పీసీసీ చీఫ్ మహేశ్
దేశంలో లౌకికవాద పరిరక్షణకు జస్టిస్సుదర్శన్ రెడ్డి గెలుపు అవసరమని పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్ అన్నారు. నైతిక విలువలకు కట్టుబడిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని, ఆయన్ను గెలిపించాలని కోరారు. సుదర్శన్‌రెడ్డి ఉప రాష్ట్రపతిగా గెలిస్తే చెదలు పట్టిన న్యాయ వ్యవస్థ మళ్లీ బలపడుతుందని సీపీఐ సీనియర్ నేత నారాయణ అన్నారు. తెలంగాణ బిడ్డ కోసం పార్టీలకతీతంగా తెలుగువారందరూ కలిసిరావాలని కోరారు. సుదర్శన్‌రెడ్డి ఉప రాష్ట్రపతి అయితే దేశంలో రాజ్యాంగం, లౌకిక వాదం, ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతాయని చెప్పారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి కోసం అందరి మద్దతు కోరుతా: సీఎం రేవంత్
జాతీయ రాజకీయాల్లో తెలుగువారి మనుగడ ప్రమాదంలో పడిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జాతీయస్థాయిలో తెలుగు వారి ఉనికి కోసం పార్టీలకతీతంగా సుదర్శన్‌రెడ్డిని ఉప రాష్ట్రపతిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో రాజకీయాలను పక్కనపెట్టి ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ మాజీ సీఎం జగన్, ఒవైసీలను కలిసి సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నానని చెప్పారు.
సుదర్శన్ రెడ్డి గెలుపుతో జాతీయ స్థాయిలో తెలుగు వారి ప్రతిష్ట పెరుగుతుందని అన్నారు. దేశంలో హిందీ మాట్లాడే వారి తర్వాత తెలుగు వారే ఎక్కువగా ఉన్నారని, తెలుగు భాషను బతికించాలంటే సుదర్శన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. గతంలో జాతీయ రాజకీయాల్లో నీలం సంజీవ రెడ్డి, వీవీ గిరి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్‌లాంటి తెలుగు నేతలు కీలక పాత్ర పోషించారని, ప్రస్తుతం తెలుగు వారు జాతీయ రాజకీయాల్లో కీలకంగా లేరని చెప్పారు.
అందుకే జస్టిస్ సుదర్శన్‌రెడ్డి గెలుపు కోసం తెలుగువారంతా ఒక్కతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఏ పార్టీతో సంబంధం లేదని, ఎందులోనూ ఆయనకు సభ్యత్వం కూడా లేదని చెప్పారు. ఓట్ చోరీ జరుగుతున్న ఈ సమయంలో దేశంలో న్యాయకోవిదుడి గెలుపు అవసరమని అన్నారు. ఉప రాష్ట్రపతిగా గెలిపించాలని కోరుతూ ఎంపీలకు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రాసిన లేఖలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.