బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం చేస్తం : మంత్రి పొన్నం

బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం చేస్తం :  మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీల జనాభాను లెక్కించి, వారికి అన్ని రంగాల్లో చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్పొరేషన్ల ఏర్పాటు పై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. శనివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన 40 బీసీ సంఘాల నేతలు సెక్రటేరియెట్ లో  మంత్రి పొన్నంను కలిసి సన్మానించారు. కులగణనపై ప్రభుత్వం జీవో విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కులగణనకు రూ. 150 కోట్లు కేటాయించామని తెలిపారు. ఇంటింటి సర్వే నిర్వహించి రాష్ట్రంలో కులాల వారీగా జనాభాను లెక్కిస్తామన్నారు. 

బీసీ కులాల లెక్కలు సేకరించడానికి చట్టబద్ధంగా జరగాల్సిన ప్రక్రియను పూర్తిచేస్తున్నామని..అందులో భాగంగానే జీవో నంబర్ 26ని విడుదల చేశామని గుర్తు చేశారు.బీసీ కులాల్లో గతంలో ఉన్న 11  ఫెడరేషన్లను యథావిధిగా కొనసాగిస్తామని, వాటిని కూడా కార్పోరేషన్లుగా మార్చె  విషయం ప్రభుత్వం పరిశీలిస్తుందని వివరించారు. కొత్తగా 8 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని.. ఇంకా బీసీ కులాల్లో కార్పోరేషన్ లేనటువంటి కులాలకు ఎంపీ ఎన్నికల తర్వాత కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని పొన్నం ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి, కో చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.