ప్రయాణికుల ఫిర్యాదులతో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు జ్యోతిరాదిత్య సింధియా

ప్రయాణికుల ఫిర్యాదులతో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు జ్యోతిరాదిత్య సింధియా

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎయిర్ పోర్టులో రద్దీపై ప్రయాణికుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఇవాళ ఉదయం విమానాశ్రయంలోని టెర్మినల్ 3ని సందర్శించారు. ఎయిర్ పోర్టు ఉన్నతాధికారులతో మాట్లాడారు. వారికి సూచనలు, సలహాలు ఇచ్చారు. 

ఫిర్యాదులు...

ఢిల్లీ విమానాశ్రయం రద్దీగా ఉండటంతో పాటు భారీ క్యూల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వీటిపై సోషల్ మీడియాలో కేంద్ర విమానయాన శాఖకు ఫిర్యాదులు వచ్చాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులోని పరిస్థితి గురించి ప్రయాణికులు ట్విట్టర్‌లో పోస్ట్ లు చేశారు. తనిఖీ కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు ప్రయాణికులు పేర్కొన్నారు. విమానం బయలుదేరే వరకు కూడా తనిఖీలు పూర్తి అవడం లేదని..క్లియరెన్స్ ప్రాంతంలో రెండు, మూడు గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోందని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే జ్యోతిరాదిత్య సింధియా విమానాశ్రయంలోని  టెర్మినల్ 3ని ఆకస్మికంగా సందర్శించారు.

సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు..

మరోవైపు.. ఢిల్లీ విమానాశ్రయంలో రద్దీని తగ్గించడానికి కేంద్ర విమానయాన శాఖ నాలుగు పాయింట్ల ప్రణాళికను రూపొందించింది. ఎక్స్-రే స్క్రీనింగ్ సిస్టమ్‌లు మెరుగుపరచడంతో పాటు రిజర్వ్ లాంజ్ తీసివేయనున్నారు. ఆటోమేటిక్ ట్రే రిట్రీవల్ సిస్టమ్, రెండు ప్రామాణిక ఎక్స్-రే యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. రెండు ఎంట్రీ పాయింట్లు - గేట్ 1A, గేట్ 8B మార్చనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం.. పీక్ అవర్ తొలగించాలని భావిస్తున్నారు.