మెడికల్ క్యాంప్ కు అనూహ్య స్పందన : : కలెక్టర్ కె.హరిత

మెడికల్ క్యాంప్ కు అనూహ్య స్పందన :  : కలెక్టర్ కె.హరిత
  •  2 వేల మంది హాజరు
  •     శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్​జిల్లా కెరమెరిలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ కు అనూహ్య స్పందన వచ్చింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో బుధవారం ఓ ఫంక్షన్ హాల్​లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి కలెక్టర్ కె.హరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లోని పేదలకు వైద్య సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 

ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వారికి కరీంనగర్​లోని ప్రతిమ మెడికల్ సైన్సెస్ వారు శస్త్ర చికిత్సలు నిర్వహించి మందులు ఉచితంగా అందిస్తారని తెలిపారు. ఈ శిబిరంలో సుమారు 2 వేల మందికి పరీక్షలు చేసి  మందులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ దత్తారావు,  సర్పంచ్ లు, ప్రతిమ ఫౌండేషన్ సభ్యులు, డాక్టర్లు, మండల సమాఖ్య సభ్యులు, సెర్ప్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించాలని  కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. కెరమెరి మండలం మెడి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ స్కూల్​ను సందర్శించి రిజిస్టర్, క్లాస్​ రూమ్​లు, కిచెన్, సరుకుల నిల్వ గది, పరిసరాలను పరిశీలించారు. టెన్త్​ స్టూడెంట్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా టీచర్లు కృషి చేయాలన్నారు. పల్లె దవాఖానాను సందర్శించి ఆస్పత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలు, రోగుల సంఖ్య, మందుల నిల్వల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. 

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మండల కేంద్రంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న సామూహిక మరుగుదొడ్ల పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయావాలని అధికారులను ఆదేశించారు. స్థానిక,  సావర్ ఖేడా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల సంఖ్య, సౌకర్యాల వివరాలు తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.