
- పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్!
- పరిశీలనలో పార్టీ సిమిలర్ నేమ్స్
- రేపటి ప్రెస్ మీట్ లో కీలక అంశాల వెల్లడి
- ఎవరి బండారం బయటపెట్టబోతున్నారు?
- హాట్ టాపిక్గా మారిన ఎమ్మెల్సీ వ్యవహారం
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం నిర్వహించబోయే ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అంశాన్ని కూడా వెల్లడిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తన పార్టీ పేరు టీఆర్ఎస్ అని ఉండేలా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆమె తెలంగాణ జాగృతి పేరుతో స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఆమె భారత జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. అదే విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్షకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో తన సొంత సంస్థ జాగృతిని పార్టీగా మార్చుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఆమె ప్రధానంగా బీఆర్ఎస్ కోల్పోయిన ‘తెలంగాణ’ అనే పదాన్ని భుజానికి ఎత్తుకోనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రైతు సమితి లాంటి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో తెలంగాణ రాజ్య సమితి ఇప్పటికే గుర్తింపు పొందని పార్టీల విభాగంలో రిజిస్టర్డ్ అయి ఉంది. టీఆర్ఎస్ కు సిమిలారిటీ గా ఉండే పేర్ల కోసం ఆమె ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రెస్ మీట్పై ఉత్కంఠ
ఎమ్మెల్సీ కవిత ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడుతారని సమాచారం అందింది. అనూహ్యంగా తన మీడియా సమావేశాన్ని రేపటికి వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతూ నిరసన గళం వినిపించిన కవిత సస్పెన్షన్ తర్వాత ఏం మాట్లాడబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు..? ఎవరి బండారం బయటపెట్టబోతున్నారు. ఆమె రాజకీయ వ్యూహం ఏమిటి అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.