13 ఏండ్ల తర్వాత వాపస్ వస్తున్న .. కాంగ్రెస్​లో చేరికపై కేకే

13 ఏండ్ల తర్వాత వాపస్ వస్తున్న .. కాంగ్రెస్​లో చేరికపై కేకే
  • ఎప్పుడు చేరేది త్వరలోనే చెప్తా 
  • కాంగ్రెస్​లో 55 ఏండ్లు పని చేసిన.. నాకు ఎన్నో పదవులు ఇచ్చింది  
  • కాకా లాంటి వాళ్లతో తెలంగాణ కోసం కొట్లాడిన 
  • టీఆర్ఎస్​ను కాంగ్రెస్​లో విలీనం చేస్తానంటే ఆ పార్టీలో చేరి రాష్ట్రం కోసం పోరాడిన 
  • కేసీఆర్ గౌరవం ఇచ్చారు.. పార్టీ ఎందుకు ఓడిందో సమీక్షించుకోవాలని వ్యాఖ్య  
  • ఇయ్యాల కాంగ్రెస్​లోకి విజయలక్ష్మి  

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో చేరుతానని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ప్రకటించారు. ఆ పార్టీలో ఎప్పుడు చేరేది త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ‘‘నేను పదవుల కోసం పార్టీ మారడం లేదు. ఇప్పటికే చాలా పదవులు అనుభవించాను. నా రాజ్యసభ పదవీకాలం ఇంకో రెండేండ్లు ఉంది. ఆ పదవి మీద మోజేమీ లేదు. కాంగ్రెస్ మళ్లీ రాజ్యసభ పదవి ఇస్తే తీసుకుంటాను. ఇవ్వకపోయినా నాకేమీ అభ్యంతరం లేదు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను. ఆ వివరాలన్నీ త్వరలోనే మీడియాకు వెల్లడిస్తాను” అని తెలిపారు.

ఇంకా ఏదో పదవిలో ఉండాలన్నా ఆశలు తనకు లేవని, కానీ ఒక సోషలిస్టుగా ప్రజలకు చేయాల్సినంత చేయలేకపోయానన్న అసంతృప్తి మాత్రం ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లోని తన నివాసంలో మీడియాతో కేకే మాట్లాడారు. ‘‘నేను 55 ఏండ్లు కాంగ్రెస్ లో పని చేసిన. దేశంలో ఎవరికీ ఇవ్వనన్ని అవకాశాలు, పదవులను ఆ పార్టీ నాకిచ్చింది. కాంగ్రెస్ నాకు సొంతిళ్లు లాంటిది. ఘర్ వాపసీ లాగా 13 ఏండ్ల తర్వాత మళ్లీ ఇంటికి వాపస్ వస్తున్న. తెలంగాణ కోసమే టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌(బీఆర్ఎస్‌‌‌‌)లో చేరాను. నేను తెలంగాణవాదిని. కేసీఆర్ కంటే ముందే స్వరాష్ట్రం కోసం పోరాటం చేశాను. కాకా వెంకటస్వామి, భాగారెడ్డి, చిన్నారెడ్డి తదితరులతో కలిసి తెలంగాణ కోసం కొట్లాడిన. కాంగ్రెస్‌‌‌‌లోనే ఉంటూ పార్టీ హైకమాండ్‌‌‌‌తో పోరాడిన. చిన్నారెడ్డి నాయకత్వంలో 42 మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమయ్యారు.

మలి దశ ఉద్యమంలో అప్పటి ఎంపీలు పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌, వివేక్ వెంకటస్వామి తదితరులు పార్లమెంట్‌‌‌‌ లోపల, పార్టీ లోపల తెలంగాణ కోసం ఫైట్ చేశారు” అని గుర్తు చేశారు. ‘‘తెలంగాణను త్వరగా ఏర్పాటు చేయాలని నేను అప్పట్లో సోనియాగాంధీని కోరాను. కానీ ఆమె ఆలస్యం చేయడం, తెలంగాణ ఏర్పాటయ్యాక టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను కాంగ్రెస్‌‌‌‌లో విలీనం చేస్తానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో... ఆయనతో కలిసి రాష్ట్రం కోసం కొట్లాడేందుకు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరాను. అందరి సహకారంతో రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంట్‌‌‌‌లో బిల్లు పాస్ కావాల్సి ఉంటుంది. ఆ పని కాంగ్రెస్ మాత్రమే చేయగలిగింది” అని అన్నారు. 

ఇండియా కూటమిలో చేరాలని కేసీఆర్​కు చెప్పిన.. 

కాంగ్రెస్‌‌‌‌లో అన్ని పదవులను అనుభవించిన తర్వాతే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరానని కేకే అన్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరిన తర్వాత మొదటి టర్మ్ ఎంపీగా కూడా కాంగ్రెస్ మద్దతుతోనే గెలిచానని గుర్తు చేశారు. ‘‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణను రీడిస్కవర్ చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు. అందుకే ఇన్నాళ్లు ఆయనతో కొనసాగాను. నాకు కేసీఆర్, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఇచ్చినంత గౌరవం ఎవరూ ఇవ్వలేదు. ఈ పదేండ్లలో జరిగిన అభివృద్ధి క్రెడిట్ మొత్తం కేసీఆర్‌‌‌‌‌‌‌‌దే. ఇంత చేసిన తర్వాత కూడా పార్టీ ఎందుకు ఓడిపోయిందో సమీక్షించుకోవాలని కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు సూచించాను. బీఆర్ఎస్​పై కుటుం బ పార్టీ అనే ముద్ర పడింది. పదవుల్లో షేరింగ్ జరిగితే బాగుండేది. యువ నాయకులను ముందు పెట్టి పార్టీని నడిపించాలని కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు సూచించాను. ఇండియా కూటమిలో చేరాలని కూడా చెప్పాను. కేసీఆర్​తో విభే దాలు లేవు.

మేమిద్దరం ఒకరికొకరం గౌరవించుకుని మాట్లాడుకుంటాం. ఇప్పుడు రాజకీయాల్లో భాష సరిగా లేదు. కుటుంబ సభ్యులను కూడా వదలకుండా తిడుతున్నారు. ఈ పద్ధతి మారాలి” అని అన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై తనకు తెలియదని, తాను కనీసం ఒక్కసారి కూడా కాళేశ్వరం ప్రాజెక్టును చూడలేదని వ్యాఖ్యానించారు. ‘‘దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. దాన్ని కాపాడగలిగే శక్తి కాంగ్రెస్‌‌‌‌ పార్టీకే ఉంది. దేశంలో కాంగ్రెస్‌‌‌‌కు ఆల్టర్నేట్ లేదు. బీజేపీ భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి పొందే పార్టీ. ఆ పార్టీని ఎదుర్కొని డెమోక్రసీని రక్షించుకోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి” అని పిలుపునిచ్చారు. జైల్లో కవితకు కావాల్సిన సౌకర్యాలు కల్పించకపోవడం కరెక్టు కాదని వ్యాఖ్యానించారు. ఇన్నేండ్ల కాలంలో తానెవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. 

అది వాళ్లిష్టం..

తన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పార్టీ మారాలని తీసుకున్న నిర్ణయంలో తన పాత్రేమీ లేదని కేకే అన్నారు. ఏం చేయాలో నిర్ణయించుకునే శక్తి, వయసు, అనుభవం ఆమెకు ఉన్నాయని చెప్పారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లోనే కొనసాగాలని తన కొడుకు విప్లవ్‌‌‌‌ తీసుకున్న నిర్ణయాన్ని కూడా గౌరవిస్తానని పేర్కొన్నారు.  

సీఎం రేవంత్​తో కేకే భేటీ 

సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కేకే శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కేకేను రేవంత్ సాదరంగా ఆహ్వానించారు. కేకే కాంగ్రెస్‌‌‌‌లో చేరనున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌‌‌‌లో కేకే చేరిక, లోక్‌‌‌‌సభ ఎన్నికలపై ఇద్దరు నేతలు కొద్దిసేపు చర్చించుకున్నారు. 

కాంగ్రెస్ లోకి విజయలక్ష్మి

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం ఉదయం 9:30 గంటలకు కాంగ్రెస్​ పార్టీలో చేరనున్నారు. బంజారాహిల్స్ లోని తన క్యాంపు ఆఫీసులో ఏఐసీసీ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్​కండువా కప్పుకోనున్నారు. పార్టీలో చేరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు.