13ఏళ్ల తీర్థయాత్ర తర్వాత సొంతింటికి వస్తున్నా: కే కేశవరావు

13ఏళ్ల తీర్థయాత్ర తర్వాత సొంతింటికి వస్తున్నా: కే కేశవరావు

లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. బీఆర్ఎస్ పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ ముఖ్యనేతలు రాజ్యసభ ఎంపీ  కే కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. తాజాగా పార్టీ మార్పుపై స్పందిస్తూ.. మార్చి 30వ తేదీ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు కే కేశవరావు స్పష్టం చేశారు.

ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ..  "తెలంగాణలో కోసం ఎంపీలతో కలిసి పోరాటం చేశా. ఏనభై ఐదేళ్ల జీవితంలో 55 ఏళ్ళు కాంగ్రెస్ లోనే ఉన్నా. మంత్రిగా, ఎంపీగా, సీడబ్ల్యూసీ మెంబర్ గా కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది.  నా రాజకీయ జీవితంలో కాంగ్రెస్ నాకు ఎంతో చేసింది. తెలంగాణపై తీర్మాణం చేసినప్పుడు కాకా వెంకటస్వామితో కలిసి పనిచేశా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నా మాటకు చాలా విలువ ఇచ్చారు.13ఏళ్ల తీర్థయాత్ర తర్వాత సొంత ఇంటికి వస్తున్నా.  కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నా" అని తెలిపారు.

 మార్చి 29వ తేదీ శుక్రవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో  కే కేశవరావు భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నట్లు సమాచారం.  సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి 24 గంటల ముందు.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో.. ఆయన ఫాంహౌస్ లో చర్చించారు. ఆ తర్వాతే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.