కేసీఆర్‌‌‌‌ను గెలిపించేందుకే జగన్‌‌ నాటకం

కేసీఆర్‌‌‌‌ను గెలిపించేందుకే జగన్‌‌ నాటకం

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌‌‌‌ను గెలిపించేందుకు నాగార్జునసాగర్‌‌‌‌ డ్యామ్‌‌కు పోలీసులను పంపించి ఏపీ సీఎం జగన్‌‌మోహన్‌‌ రెడ్డి నాటకమాడారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. పోలింగ్‌‌ రోజు తెల్లవారుజామున డ్యామ్‌‌కు పోలీసులను పంపించి, గొడవ సృష్టించారని మండిపడ్డారు. 

శుక్రవారం హైదరాబాద్ మగ్దూంభవన్‌‌లో సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలమల్లేశ్‌‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో హంగ్ వచ్చే అవకాశం లేదని, కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌‌కు అనుకూలంగా ఉండడంపై కేటీఆర్‌‌‌‌కు కోపం వచ్చిందని చెప్పారు. ఆదివారం ప్రజాస్వామ్యం గెలుస్తుందని, అహంభావం ఓడిపోనుందని తెలిపారు. పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన కొత్తగూడెంలో కూనంనేని సాంబశివరావు గెలవబోతున్నారని, ఆయన విజయం కోసం కృషి చేసిన కాంగ్రెస్, సీపీఎం, టీజేఎస్, ప్రజాపంథ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. 

తెలంగాణ ప్రజలు అవినీతినైనా సహిస్తారేమో కానీ అహంభావాన్ని సహించబోరన్నారు. ఆ అహంభావమే కేసీఆర్, కేటీఆర్‌‌‌‌ను ఓడిస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ గతంలో డాటర్ స్ట్రోక్ తగిలితే, ఖమ్మంలో పువ్వాడకు సన్ స్ట్రోక్ తగలనుందని విమర్శించారు. ఎన్నికల్లో ఓటు వేసిన అనేక మంది ముసలివాళ్లను చూసి హైదరాబాద్‌‌లో ఓటు వేయని వారు సిగ్గుపడాలన్నారు. గతంలో హైటెక్ సిటీని చూసి తనకు ఓట్లు వేస్తారని చంద్రబాబు అనుకున్నారని, ఇప్పుడు కేటీఆర్ కూడా హైదరాబాద్ జిగేల్ చేసి మాకే ఓట్లేస్తారని భావించారని, తీరా సిటీలో ఓటింగ్ తగ్గిందన్నారు. అభివృద్ధి చేశామని కేసీఆర్ అంటున్నారని, అభివృద్ధి ప్రజలదా.. కల్వకుంట్ల కుటుంబానిదా.. అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఎవరిని నిర్ణయించినా సీపీఐ మద్దతునిస్తుందని చెప్పారు.