టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్


ప్లీనరీ కోసం హైదరాబాద్ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కట్టడంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. రూల్స్ కు విరుద్ధంగా ఉన్న ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని కోరారు. రోడ్డు మధ్యలో ఫ్లెక్సీలు ఎలా పెడుతారని పాల్ ప్రశ్నించారు. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి ఫ్లెక్సీలు పెట్టొద్దని గతంలో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందని.. ఇప్పుడు ఎందుకు రూల్స్ ని బ్రేక్ చేశారని కేఏ పాల్ ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ అధికార టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ కోసం సిటీ వ్యాప్తంగా ఫ్లెక్సీలను పెట్టారని ఆరోపించారు. పార్టీ ఫ్లెక్సీలను తొందరగా తొలగించాలని పాల్ డిమాండ్ చేశారు. 

క్లాసిఫైడ్స్‌తో ప్రచారం చేసుకోవడం తప్పు కాదన్న ఆయన.. కానీ రోడ్డు మధ్యలో ఫ్లెక్సీలు పెట్టడం తప్పని చెప్పారు. వాటివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. రోడ్లపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని కేఏ పాల్ హైకోర్టును కోరారు. కొద్దిరోజులుగా తెలంగాణలో దూకుడు పెంచిన కేఏ పాల్.. అధికార టీఆర్ఎస్‌పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. టీఆర్ఎస్‌కు 30 సీట్లు కూడా రావంటూ గట్టిగా చెబుతున్నారు. ఇటీవలే గవర్నర్ తమిళిసైని కూడా కలిశారు. తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ పాలన అవినీతిమయమని.. అసలు తాను ఇప్పటివరకు ఇంత అవినీతి పాలన ఎప్పుడూ చూడలేదంటూ ఆరోపణలు చేశారు. రేపో మాపో సీఎం కేసీఆర్ అరెస్ట్ కావడం తప్పదంటున్నారు.   

టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సిటీలో ఎక్కడ చూసినా ఆ పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లే కనిపిస్తున్నాయి. ప్లీనరీ కోసం కొన్నిచోట్ల ట్రాఫిక్​ సిగ్నల్స్ కు అడ్డంగా కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ ట్విట్టర్ ఖాతకు వస్తున్న ఫిర్యాదులకు మాత్రమే అధికారులు జరిమానాలు వేస్తున్నారు. దీంతో ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. 

గతంలో టీఆర్ ఎస్ ప్లీనరీ సమయంలో సెలవుల్లో వెళ్లిన జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్, ఇప్పుడు మళ్లీ సెలవులపై వెళ్లారు. ఇటీవల ఫ్లెక్సీ ప్రింటింగ్ సెంటర్ల మీద రైడ్స్ చేసిన ఈవీడీఎం వింగ్ ఇప్పుడు సైలెంట్ అయింది. బీజేపీ ఫ్లెక్సీలు ప్రింట్ చేస్తున్న ప్రింటింగ్ ప్రెస్ లనే టార్గెట్ చేసి తనిఖీలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్లీనరీకి సంబంధించి వేలాది ఫ్లెక్సీలు ఎక్కడి నుంచి ప్రింట్ అయ్యాయనే దానిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.