అన్ని పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు ఇయ్యాలె

అన్ని పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు ఇయ్యాలె

బషీర్ బాగ్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని 13 బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. టికెట్లు ఇవ్వని పార్టీలను ఓడిస్తామని హెచ్చరించాయి. ఆదివారం హైదరాబాద్ లోని కాచిగూడలో బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో 50 శాతానికి పైగా బీసీలు ఉన్నారని, బీసీలకు టికెట్లు ఇస్తే కచ్చితంగా గెలుస్తారని అన్నారు. ‘‘ప్రతి పార్టీ బీసీలకు 70 సీట్లు కేటాయించాలి. లేని పక్షంలో బీసీలు తిరగబడతారు. టికెట్లు ఇవ్వని పార్టీలను ఓడిస్తారు” అని హెచ్చరించారు. బీసీలకు ఇచ్చేది భిక్ష కాదని, ఇది ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్నారు. 

ఏ వర్గ జనాభా ఎంతుంటే, ఆ వర్గానికి అన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ‘‘అన్ని పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి. జెండాలు మోయడానికి, జిందాబాద్ కొట్టించుకోవడానికి ఉపయోగించుకుంటున్నాయి” అని మండిపడ్డారు. ఒక్క బీజేపీ మాత్రమే బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని గుర్తు చేశారు. ‘‘రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే, వారిలో బీసీలు కేవలం 21 మంది మాత్రమే. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 18 జిల్లాల నుంచి ఒక్క బీసీ ఎమ్మెల్యే లేరు. ఇంత అన్యాయం జరుగుతున్నా బీసీలను ఎవరూ పట్టించుకోవడం లేదు. 

7శాతమే జనాభా ఉన్న అగ్ర కులాల నుంచి 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రిజర్వేషన్లు లేని ఎమ్మెల్సీ పదవుల్లో 90 శాతం మంది అగ్రకులాల వాళ్లే ఉన్నారు” అని చెప్పారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ , బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేశ్, కోట్ల శ్రీనివాస్, రామకృష్ణ, టి. రాజ్ కుమార్,  భూమన్న, మంజుల గౌడ్, ప్రసాద్, రామ్ దేవ్, హేమంత్ పాల్గొన్నారు.