నిర్మల్, వెలుగు: ఖరీఫ్ సీజన్ లో నిర్మల్‌జిల్లా కడెం ప్రాజెక్టు కింద దాదాపు 60 వేల ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. వారం కింద ప్రాజెక్టు నీటితో నిండుకుండలా కళకళలాడింది. వరద ప్రవాహంతో ఓ దశలో ప్రాజెక్టు కొట్టుకుపోతుందేమోనని అంతా భయాందోళనకు గురయ్యారు. అలాంటిది ప్రస్తుతం రిజర్వాయర్ డెడ్‌స్టోరేజీకి చేరుకుంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వస్తున్న వరద నీరు ఉన్నది ఉన్నట్టుగా దిగువకు వెళ్లిపోతోంది. కడెం ప్రాజెక్టు కింద ఖరీఫ్ సీజన్లో 68,150 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పసుపు పంటలను సాగు చేస్తుంటారు. 80 శాతం మేరకు వరి సాగవుతోంది. ప్రస్తుతం వరదల కారణంగా ప్రాజెక్టు గేట్లు పనిచేయకపోవడంతో సాగునీటి విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారు.
చాలాచోట్ల ఇసుక మేటలు..
ఇప్పటికే వరద కారణంగా పంటలన్నీ నీటిపాలవడమే కాకుండా చాలాచోట్ల ఇసుక మేటలు వేశాయి. మరో 10 రోజుల్లో గా కడెం ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లకు రిపేర్లు చేసి వాటిని పైకి, కిందికి దించే పరిస్థితి ఉంటేనే ఖరీఫ్ పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందంటున్నారు. లేనట్లయితే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు కురిసినా వచ్చినా నీరంతా అలాగే కిందకు వెళ్లిపోతుంది. దీని కారణంగా ఖరీఫ్ పంటల సాగు సాధ్యం కాదని చెబుతున్నారు. కొన్నిచోట్ల మాత్రం బోరు బావులపై ఆధారపడి పంటల సాగు చేస్తున్నప్పటికీ దాదాపు 60 వేలకు పైగా ఎకరాలకు కడెం నీరే ఆధారం. రెండు రోజుల క్రితం కడెం ప్రాజెక్టును టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ బృందం పరిశీలించింది. ప్రాజెక్టు ఆధునికీకరణ, గేట్లు, కౌంటర్ వెయిటర్ రిపేర్ల కోసం చేపట్టాల్సిన చర్యలపై ఈ టీం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడితేనే రిజర్వాయర్ కింద పంటల సాగుకు అవకాశముంటుందని ఇంజనీరింగ్నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం నిధుల మంజూరులో జాప్యం చేస్తే మాత్రం 60 వేల ఎకరాల్లో పంటల సాగు కష్టమేనని అంటున్నారు.
రిపేర్లకు రూ. 10 కోట్లు కావాలె
కడెం ప్రాజెక్టులో ప్రస్తుతం గేట్ల ఆపరేటింగ్ అత్యంత కీలకం. మొత్తం 18 గేట్లకు ఇప్పటికే ఒక గేటు పూర్తిగా పనిచేయడం లేదు. వరద సమయంలో ఈ గేటును పైకెత్తలేకపోయారు. అధికారులు కేవలం 17 గేట్లతోనే నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం మరో గేటును కిందికి దింపగలిగారు. ఈ రెండు గేట్లు వరద నీటిని అడ్డుకుంటుండగా 16 గేట్లను కిందికి దింపడం ప్రస్తుతం సాధ్యం కావడం లేదు. ఇందులో 9 జర్మన్ గేట్ల పరిస్థితి మరింత గందరగోళంగా మారిందంటున్నారు. గేట్లతోపాటు కౌంటర్ వెయిటర్లను కూడా రీప్లేస్ మెంట్ చేయాల్సి ఉంది. మరో వారం పది రోజుల తర్వాతే గేట్లు, కౌంటర్ వెయిటర్ల పరిస్థితి ఎలా ఉందన్న విషయం తెలుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కడెం రిపేర్లకు తక్షణం రూ. 10 కోట్ల వరకు కావాలని చెబుతున్నారు. దీనికి సంబంధించి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ప్రభుత్వానికి అందించే నివేదిక కీలకంగా మారనుంది. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం కడెం ప్రాజెక్టు గేట్ల రిపేర్లు, ఆధునికీకరణకు చర్యలు తీసుకోనుంది. దాంతో ప్రస్తుతం కడెం ఆయకట్టు రైతులంతా ఎక్స్ పర్ట్స్ కమిటీ నివేదికపైనే ఆశలు పెట్టుకున్నారు. కడెం ప్రాజెక్టుకు సంబంధించిన మెయిన్ కెనాల్ తో పాటు లెఫ్ట్ కెనాల్ కు సైతం చిన్నపాటి రిపేర్లు అవసరమవుతాయని రైతులు పేర్కొంటున్నారు.
కమిటీ రిపోర్టు ఆధారంగా పనులు
కడెం ప్రాజెక్టు రిపేర్లు, ఆధునికీకరణ పనులకు సంబంధించి నిపుణుల కమిటీ సిఫారసుల మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఒకటి రెండు రోజుల్లో ఈ నివేదిక వెల్లడవుతుంది. అప్పటివరకు గేట్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఖరీఫ్ పంటల సాగు విషయం కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
- సుశీల్ దేశ్ పాండే, ఎస్ఈ, ఇరిగేషన్, నిర్మల్
