ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన్రు : కడియం శ్రీహరి

ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన్రు :  కడియం శ్రీహరి

హైదరాబాద్, వెలుగు: ప్రజలకు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. నిరుద్యోగులకు ప్రతి నెల రూ.4 వేల చొప్పున భృతి ఇస్తామని హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ సభలో ఆ పార్టీ ముఖ్య నేత ప్రియంకా గాంధీ చెప్పారని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా దానిని పొందుపర్చారని గుర్తుచేశారు. అయితే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాత్రం నిరుద్యోగ భృతి గురించి తాము ఎక్కడా హామీ ఇవ్వలేదంటున్నారని మండిపడ్డారు. 

అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు మర్చిపోతున్నారన్నారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పారని, ఎవరైనా రుణాలు తీసుకోకపోతే వెంటనే బ్యాంకులకు వెళ్లి లోన్లు తీసుకోవాలని ఎన్నికల టైమ్‌‌లో రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. మద్దతు ధరకు రూ.500 బోనస్ ఇచ్చి వడ్లను కొనుగోలు చేస్తామని చెప్పారని, ఇప్పటి వరకు కొనుగోళ్లు జరపలేదన్నారు.

 ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేయాలని, దానికి తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుకు సంవత్సరమైనా ఓపిక పట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ఆదాయ వనరులపై సమీక్ష లేకుండా అమలు కానీ హామీలను కాంగ్రెస్‌‌ పార్టీ ఇచ్చిందని మండిపడ్డారు.