
జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ తో ప్రారంభం కానున్న 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు భారత టెస్ట్ జట్టును బీసీసీఐ శనివారం (మే 24) ప్రకటించింది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును అనౌన్స్ చేసింది. మొత్తం 18 మందితో కూడిన ఈ స్క్వాడ్ లో జడేజాను మినహాయిస్తే అందరూ యంగ్ ప్లేయర్లే కావడం విశేషం. కొంతమంది సీనియర్ ప్లేయర్లకు సెలక్టర్లు షాక్ ఇస్తే.. మరికొంత మంది యంగ్ క్రికెటర్లు తొలిసారి టెస్ట్ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. భారత స్క్వాడ్ లో షమీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్ లను సెలక్టర్లు పక్కన పెట్టారు. వీరిని ఎంపిక చేయకపోవడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
శ్రేయాస్ అయ్యర్ కు నో ఛాన్స్:
టెస్ట్ క్రికెట్ లో ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడుకున్న శ్రేయాస్ అయ్యర్ కు సెలక్టర్లు బిగ్ షాక్ ఇచ్చారు. అయ్యర్ ఇటీవలే రంజీ ట్రోఫీలో అద్భుతంగా ఆడి ఫామ్ లోకి వచ్చినా అతనిని సెలక్టర్లు పరిగణించలేదు. వైట్ బాల్ క్రికెట్ లో సూపర్ ఫామ్ లో ఉన్న అయ్యర్ టెస్ట్ క్రికెట్ లో స్థానం దక్కించుకోవాలంటే మరింత కష్టపడాల్సిందే. గత ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత జట్టులో స్థానం కోల్పోయిన అయ్యర్ ఇప్పటివరకు జట్టులో స్థానం దక్కించుకోలేదు. కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించడంతో శ్రేయాస్ కు నిరాశ తప్పలేదు.
షమీకి తిరగబెట్టిన గాయం:
ఇంగ్లాండ్ తో జరగబోయే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు షమీని ఎంపిక చేయలేదు. శనివారం (మే 24) ఇంగ్లాండ్ టూర్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో షమీకి చోటు దక్కకపోవడం షాకింగ్ కు గురి చేసింది. గాయంతో ఇబ్బంది పడుతున్నా షమీ MRI స్కాన్ చేయించుకున్న తర్వాత అతను 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ఫిట్ గా ఉండలేడ వైద్యులు చెప్పారు. దీంతో ఇంగ్లాండ్ సిరీస్ లో ఆడాలన్న అతనికి నిరాశే మిగిలింది.
విదేశాల్లో అక్షర్ అవసరం లేదు:
టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా స్క్వాడ్ లో స్థానం సంపాదించలేకపోయాడు. అవకాశం వచ్చినప్పుడు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చే అక్షర్.. ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపిక కాకపోవడానికి కారణం లేకపోలేదు. ఇంగ్లాండ్ లోని పిచ్ లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తాయి. అక్కడ స్పిన్నర్ల అవసరం ఉండదు. జడేజా, సుందర్, కుల్దీప్ లలో ఒకరిని పక్కనపెట్టి అక్షర్ కు ఛాన్స్ ఇవ్వడం అసాధ్యం. అక్షర్ స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్ కు ఎంపికవ్వడంలో ఎలాంటి సందేహం లేదు.
సర్ఫరాజ్ కు అన్యాయం:
మొన్నటి వరకు టెస్ట్ స్క్వాడ్ లో లేని సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ మీద నమ్మకముంచిన సెలక్టర్లు సర్ఫరాజ్ కు మాత్రం అన్యాయం చేశారనే చెప్పాలి. ఇంగ్లాండ్ సిరీస్ కోసం సర్ఫరాజ్ కఠినమైన డైట్ ప్లాన్ చేసి 10 కిలోల బరువు తగ్గాడు. అతను ఫిట్ గా ఉండటానికి ఉడికించిన కూరగాయలు తిన్నాడు. చికెన్ పూర్తిగా మానేసి ఫిట్ నెస్ పై ఫోకస్ చేశాడు. ఫిట్ నెస్ తో పాటు నెట్స్ లో తీవ్రంగా శ్రమించాడు. రోజుకు రెండు పూటలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆఫ్-స్టంప్ బయట పడిన బంతులని ప్రాక్టీస్ చేస్తూ బిజీగా మారాడు. దీంతో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు అవకాశం వస్తుందని భావించినా విపరీతమైన పోటీ కారణంగా నిరాశ తప్పలేదు.