పేరు మార్చుకున్న బ్యాంక్.. ఇక డెబిట్ కార్డ్, చెక్‌బుక్ పనిచేయవా..! అలర్ట్

పేరు మార్చుకున్న బ్యాంక్.. ఇక డెబిట్ కార్డ్, చెక్‌బుక్ పనిచేయవా..! అలర్ట్

దేశంలోని ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయిన నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తాజాగా తన పేరును స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ గా మార్చుకుంది. అయితే ఇప్పటికే పేరు మార్పు కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కంపెనీ అనుమతిని కూడా పొందింది. అయితే ఈ పేరు మార్పు కారణంగా చాలా మంది కస్టమర్లలో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. తమ చెక్ బుక్స్, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఐఎఫ్ఎస్సీ కోడ్, పాస్ బుక్ గతంలో మాదిరిగానే పనిచేస్తాయా లేక వాటిని మార్చుకోవాలా అనే ఆందోళనలో వారున్నారు. 

అయితే రిజర్వు బ్యాంక్ రూల్స్ దీని గురించి ఏం చెబుతున్నాయనే విషయాన్ని గమనిస్తే.. ప్రస్తుత ఖాతాదారులు తమ బ్యాంకింగ్ సేవలను ఎలాంటి అంతరాయాలు లేకుండా పాత కార్టులు, చెక్స్, పాస్ బుక్ వినియోగించుకోవటానికి అంగీకరిస్తోంది. అలాగే ప్రత్యేక నోటిఫికేషన్ జారీ అయ్యేంతవరకు ఐఎఫ్ఎస్సీ కోడ్లలో మార్పులు ఉండబోవని తేలింది. రిజర్వు బ్యాంక్ అంగీకారం లభించినప్పటికీ మార్పులు రాత్రికిరాత్రే జరగవు. దీనికి సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నా కస్టమర్లు తమకు దగ్గరలోని బ్యాంకింగ్ శాఖను నేరుగా సంప్రదించవచ్చు. 

ప్రస్తుతం తాము దేశంలోని అత్యంత ప్రియమైన బ్యాంకును నిర్మించే పనిలో ఉన్నట్లు స్లైస్ ప్రతినిధి చెప్పారు. అలాగే కస్టమర్ల డబ్బు, సమయాన్ని జాగ్రత్తగా చూసుకోవటమే తమ లక్ష్యమన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బ్యాంక్ తన కార్యకలాపాలను విస్తరిస్తోందని.. ప్రస్తుతం స్లైస్ పేరుతో రీబ్రాండింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. 

ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే కొందరు సైబర్ నేరగాళ్లు ఈ పేరుమార్పును తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉంటుంది. కేవైసీ పూర్తి చేయాలనో లేక కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు కావాలనో వారు కోరే ప్రమాదం ఉంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి కాల్స్ వచ్చినా వెంటనే దగ్గరలోని బ్యాంకును సందర్శించటం ముఖ్యం.