
- 10 కి.మీ దూరం నుంచే పుష్కరస్నానాలకు భక్తులు నడక
- వర్షంతో పార్కింగ్ ప్లేస్ లు లేక రోడ్లపైనే వేల వాహనాలు
- కంట్రోల్ చేయలేక.. చేతులెత్తేసిన ఆఫీసర్లు, పోలీసులు
- ఎండ, ఉక్కపోత తో ఇబ్బంది పడ్డ పిల్లలు, వృద్ధులు
జయశంకర్ భూపాలపల్లి/మహదేవ్‌పూర్, వెలుగు: కాళే-శ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తులకు ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. ఎక్కడకక్కడ వాహనాలను రోడ్లపైనే నిలిచిపోవడంతో 10 కి.మీ దూరానికి పైగా భక్తులు నడుచుకుంటూ వెళ్లి పుష్కరస్నానం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ జామ్ కారణంగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనం చేసుకోకుం డానే వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. పార్కింగ్ ప్లేస్ లు సరిపోకపోవడంతో రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. శనివారం ఒక్క రోజే 30 కి.మీ మేర కాళేశ్వరం నుంచి కాటారం వరకు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. గంటలకొద్దీ భక్తులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ కంట్రోల్ ఎలా చేయాలో తెలియక ఆఫీసర్లు, పోలీసులు చేతులెత్తేశారు.
ఆఫీసర్లు ఫెయిల్
సరస్వతి పుష్కరాలను ఈనెల15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన రెండు రోజులకే భక్తులకు ఇబ్బందులు మొదలు అయ్యాయి. ఈనెల 17న శనివారం, 18న ఆదివారం మహాదేవ్‌పూర్ ‒ కాళేశ్వరం రూట్‌లో15 కి.మీ మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. భక్తులు తీవ్ర ఎండతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాగునీళ్లు లేక జెన్‌కో పైప్‌లైన్ గేట్‌వాల్వ్ నీటిని పట్టుకొని దూప తీర్చుకున్నారు. నాలుగైదు గంటలు వెయిట్ చేస్తే తప్ప భక్తులు పుష్కర ఘాట్లకు చేరుకోలేకపోయారు.
ముందస్తు ఏర్పాట్లలో ఆఫీసర్లు ఫెయిల్ అయ్యారు. ములుగు జిల్లాలో ప్రతీ రెండేండ్లకోసారి జరిగే మేడారం మహాజాతర సందర్భంగా రోజుకు 30 నుంచి 40 లక్షల మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఉండకపోయేది. అలాంటిది సరస్వతి పుష్కరాలకు కేవలం రోజుకు 2, 3 లక్షల మంది భక్తులు హాజరవుతుండగా.. 20 నుంచి 25 కి.మీ ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు.
తెల్లవారుజామునుంచే వాహనాల క్యూ
శనివారం వీకెండ్ కావడంతో పాటు పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో తెల్లవారు జామునుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. పుష్కర దారిలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ క్యూ కట్టాయి. శుక్రవారం సాయంత్రం కాళేశ్వరంలో వాన పడి పంట పొలాల్లోని పార్కింగ్ ప్లేస్‌లు బురదమయంగా మారాయి. అందులో డస్ట్ పోసి అందుబాటులోకి తెస్తామని ఆఫీసర్లు చెప్పినా పనులు పూర్తికాలేదు. దీంతో పార్కింగ్ ప్లేస్‌లు లేక వెహికల్స్ రోడ్లపైనే నిలిపేశారు. కాళేశ్వరం నుంచి పూసుకుపల్లి, ముద్దులపల్లి, అన్నారం, మహాదేవ్‌పూర్, కాటారం వరకు సుమారు 25 కి.మీ ట్రాఫిక్ జామ్ అయింది. మధ్యాహ్నం 12 గంటలకు భూపాలపల్లి నుంచి బయలుదేరిన భక్తులు సాయంత్రం 5 గంటలైనా కూడా చేరుకోలేదు. రాష్ట్రం నలుమూలల నుంచి వందల సంఖ్యలో వచ్చిన వాహనాలన్నీ రోడ్లపైనే పెట్టారు. వన్ వే, టూ వే అంటూ పోలీసులు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. 10 కి.మీ దూరం నుంచే వేలాది మంది భక్తులు కాలినడకన వెళ్లి పుష్కరస్నానాలు చేశారు. సరస్వతి ఘాట్‌పైనే కొబ్బరికాయలు కొట్టి సమయం లేక కాళేశ్వరుని దర్శించుకోకుండానే ఇంటిబాటపడ్డారు.
ఇయ్యాల కాళేశ్వరానికి గవర్నర్
మహదేవపూర్ : సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానానికి ఆదివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కాళేశ్వరానికి రానున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలు దేరి 11 గంటలకు కాళేశ్వరం చేరుకుంటారు. పుష్కర స్నానం ముగించుకుని , కాళేశ్వరం ఆయలంలో స్వామివార్ల దర్శనం, ప్రత్యేక పూజలు చేస్తారు. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరుతారు.