బుస్సాపూర్ లో గంటలోనే చోరీ సొత్తు రికవరీ..12 తులాల బంగారం, రూ.2.10 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

బుస్సాపూర్ లో గంటలోనే చోరీ సొత్తు రికవరీ..12 తులాల బంగారం, రూ.2.10 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
  • గంటల్లోనే ముగ్గురిని  పట్టుకున్న పస్రా పోలీసులు
  • ములుగు జిల్లా  బుస్సాపూర్ లో ఘటన

ములుగు(గోవిందరావుపేట), వెలుగు : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్​ లో దొంగలు బీభత్సం చేశారు.  ఇంట్లో ఎవరూ లేని సమయంలో నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. సమాచారం అంద డంతో పోలీసులు వెళ్లి గంటల వ్యవధిలోనే దొంగలను గుర్తించి సొత్తును రికవరీ చేశా రు. గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుస్సాపూర్​ గ్రామానికి చెందిన మహిళ పుల్యాల రజినీ ఇంటికి తాళం వేసి శనివారం రాత్రి అదే గ్రామంలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది.  

ఆదివారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉండగా లోనికి వెళ్లి చూడడంతో బీరువా పగలగొట్టి ఉంది. అందులోని 12 తు లాల బంగారం, రూ. 2.10 లక్షల నగదు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి  పోలీసులు విచారణ చేపట్టి.. డాగ్​స్క్వాడ్​టీమ్ తో ఇంట్లో ఆధారాలు సేకరించారు. గంటల వ్యవధిలోనే దొంగలను గుర్తించి పట్టుకుని పస్రా పోలీస్​స్టేషన్​ కు తరలించా రు. బుస్సాపూర్​గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు, నగదు, నగలు రికవరీ చేసినట్టు ఎస్ఐ కమలాకర్​తెలిపారు. పస్రా పోలీసులను  ములుగు ఎస్పీ శబరీష్, డీఎస్పీ రవీందర్​అభినందించారు.