తెలంగాణ అంటే పాట. పాటంటే తెలంగాణే. బహుశా ప్రపంచంలోనే మరెక్కడా లేనన్ని వైవిధ్యమైన పాటలు ఇక్కడి నుండే వచ్చాయి. పాట ఉనికి లేకుండా తెలంగాణ నేల ఎప్పుడూ లేదు. కాలం ఏదైనా, ఉద్యమం ఏదైనా, సందర్భం ఏదైనా పాట ప్రవహిస్తూనే ఉంది. అంతగా ప్రజల జీవితాలతో ముడివేసుకున్న పేగుబంధం పాట. అందుకు కారణం ఇక్కడి ప్రజల జీవన విధానమే. ప్రకృతికి దగ్గరగా జీవించేతనమే పాటకు ప్రాణం పోసింది. ప్రజల నోళ్లల్లో వందలు, వేల పాటలు పురుడు పోసుకున్నాయి. అవి తరం నుండి తరానికి అందించబడ్డాయి. ఆ తరువాత ఇదే జానపద బాణీలో ఉద్యమ పాటలు కూడా వందలు, వేలు వెలువడ్డాయి. ఆ పాటల ఉధృతి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు కొనసాగింది. ఈ నేపథ్యంలోనే వందలాదిమంది కొత్త పాటకవులు పుట్టుకొచ్చారు. వారి వంతు భాగస్వామ్యాన్ని అందించారు. మరి తెలంగాణ వచ్చిన ఈ పన్నెండేళ్ల కాలం పాట ఎటు వైపు టర్న్ తీసుకుంటున్నది? అది ఏం ఆకాంక్షిస్తున్నది? బాణిలో, భావంలో ఎటువంటి మార్పు వచ్చిందో ఇప్పుడు సమీక్షించుకోవాలి.
ప్రజల పాట ప్రయాణాన్ని ఇప్పుడు రెండు విధాలుగా విభజించవచ్చు. 1.తెలంగాణ రాష్ర్ట సాధన వరకు ఆలోచింపజేసిన ఉద్యమ పాట. 2.సామాజిక మాధ్యమాల కేంద్రంగా అలరింపజేస్తున్న ఆధునిక జానపద పాట. మొదటి పాటకు ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. అది ప్రజా ప్రయోజనంతో ముడిపడి ఉంది. దాని మీద అంతకంటే ముందటి ఉద్యమాల ప్రభావం ఉంది. అందువల్ల పాటకవులు ప్రజల బాధలకు, గాథలకు గొంతుకలయ్యారు. నెత్తురసొంటి పాటలను అందించారు. మూడున్నర కోట్లమంది ఆకాంక్షలను నెరవేర్చారు. ఈ పాటకు బాణి ప్రధానంగా జానపద బాణి. తెలంగాణ పల్లెల్లో ఉండే ప్రజలు తమ రోజువారి జీవితంలో అనేక పాటలు అల్లుకున్నారు.
ఈ పాటల్లో వ్యవసాయ వృత్తి ఆధారితమైన పాటలు ఒక భాగమైతే, మరోవైపు వివిధ ఉపకులాల కథకు పాటే ప్రధాన ఆయుధం. అందువల్ల ఈ ఉపకులాల కథాగానంలో అనేక పాటలు సృజించబడ్డాయి. అవి కథను నడిపించేవే అయినప్పటికీ, విడివిడి పాటలుగా కూడా ప్రజల జీవితాలతో మమేకం అయ్యాయి. చిందు యక్షగానం, శారదకాండ్రు, మందహెచ్చులోళ్లు, బైండ్ల, ఒగ్గు కథ వంటి అనేక కళారూపాల్లో పాట మమేకమై ఉంది. ఈ బాణి ఉద్యమాల పాటకు కూడా ఊపిరిపోసింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటకాలం నుండి నేటివరకు పాటలకు ఈ బాణీలే ఆధారమయ్యాయి. జననాట్యమండలి, ప్రజానాట్యమండలి, అరుణోదయ, ప్రజా కళామండలి వంటి సాంస్కృతిక సంఘాల పాటల్లో ఈ జానపద బాణీలతో కూడిన పాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఆలోచింపజేశాయి. ఉద్యమాలకు మద్ధతును కూడగట్టాయి. ఇదంతా నిన్నటి చరిత్ర.
ఇక నేడు ఈ ఆధునిక జానపద విజృంభణ మొదలైంది. ఇది ప్రధానంగా యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలను ఆధారం చేసుకుని విజృంభిస్తున్నది. ఈ పాటకు అలరింపజేయడమే ప్రధానమైన లక్ష్యంగా కనిపిస్తున్నది. ఒకప్పుడు జానపదం అంటే అది ప్రజల పాట. దానికి రచయిత ఉండరు. ఇది పలాన వ్యక్తి రాసిండనే పేరు ఉండదు. ఆ ఒరిజినల్ జానపదంలో వాడిన పదాల అల్లిక ప్రత్యేకంగా ఉంటుంది. అది గ్రామీణ ప్రజల వ్యవహారంతో ముడిపడి ఉంటుంది. అందులో గొప్ప భావుకత ఉంటుంది. సరదాలు, సయ్యాటలు, సంసార ఈతి బాధలు, ప్రేమలు, అనురాగాలు, అనుబంధాలు ఎన్నెన్నో ఆనాటి పాటల్లో దాగి ఉన్నాయి. మరి ఇవాళ్టి ఆధునిక జానపదం బాణి మారింది. ఇది సినిమాటిక్ శైలితో కూడుకుని ఉంది. వినడం ఆలోచించడం అనేదాని స్థానంలో చిందులు వేసి ఊగి ఆడేవిధంగా ఒక ఎంటర్టైన్మెంట్ సాధానంగా పాట మారిపోయింది. ఇప్పుడు ఇదే ట్రెండ్. తెలంగాణ ఆధునిక జానపదం గ్లోబును షేక్ చేస్తున్నదంటే అతిశయోక్తి కాదు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాము రాథోడ్ అనే కళాకారుడు రాసి, పాడి, నటించి ప్రజలకు అందించిన ‘‘రాను బొంబాయికి రాను...’’అనే పాట వందలాది మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. భాషాంరాల ఎల్లలు దాటి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ఆదరణను దక్కించుకుంది. ఇలాంటి పాటలు ఎన్నెన్నో వెలువడ్డాయి. ఇంకా వెలువడుతున్నాయి. దీంతో తెలంగాణ నేలకు ఉన్న పాటల చరిత్ర ఇప్పుడు ఒక మలుపు దశలో ఉంది. దీనిని సంధికాలం అనుకోవచ్చు.
ఈ పాటల మీద ప్రజా ఉద్యమ పాటల ప్రేమికులకు ఒక చులకన భావం కలగడం సహజం. పాటంటే వారి దృష్టిలో కొన్ని ఆలోచనలు అప్పటికే ఉండి ఉండడం వల్ల ఇవి వారికి అంతగా రుచించకపోవచ్చు గానీ, ఈ పాటలు ఇప్పుడు తెలంగాణ యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. టీనేజ్ దాటిన పిల్లలు, యూత్‌ను టార్గెట్ చేసుకుని సృజించబడుతున్నాయి. యువత నాడీ పట్టుకుని వారిని ఆకట్టుకోవడమే ఈ పాటల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నది. ఈ ఆధునిక జానపద పాట వెనకాల కమర్షియల్ కోణం కూడా లేకపోలేదు. పాటతో బిజినెస్ చేయాలనుకునే యువత కూడా ఈ ఆధునిక జానపదం వైపు అర్రులు చాస్తున్నారు.
యూట్యూబ్ రాకముందు మన పాటకు భౌగోళిక సరిహద్దులున్నాయి. అది తెలంగాణ కేంద్రంగా చరిత్రను సృష్టించడమో, తెలుగు నేలకు విస్తరించి ఆలోచింపజేయడమో చేసేది. ఇవాళ యూట్యూబ్ వచ్చాక ఈ ఆధునిక జానపద పాటలు ఖండాలు దాటి విదేశాలకు సైతం విస్తరిస్తున్నాయి. అది కూడా కేవలం తెలుగు వాళ్లనే కాదు, మన భాష కాని ప్రజలను కూడా ఈ ఆధునిక జానపదం ఆకట్టుకుంటున్నది. సరికొత్త చరిత్రను సంతరించుకుంటున్నది. తెలంగాణ పాట అన్న మాటకు అర్థం మారుతున్నది. ఆలోచింపజేసిన దశ నుండి కేవలం అలరింపజేసే సాధనంగా మారుతున్నది. మార్పు అనివార్యం.
పాత జానపద పాటల్లోని ఫ్లేవర్‌ను అద్ది, ఆధునిక డీజే స్టైల్ పాటలను తయారు చేసే మిక్స్డ్ కల్చర్ కూడా ఇవాళ తెలంగాణ పల్లెలను తాకుతున్నది. ఈ పాటల్లోని భావాన్ని విని ఆనందించడం కంటే, కేవలం రిథమ్‌ను, బీట్‌ను ఆస్వాదిస్తూ డ్యాన్స్ చేస్తూ ఈ పాటలను వాడుకుని వదిలేస్తున్నారు. ఈ ఆధునిక జానపదంలో ఇది కూడా ఒక ప్రధాన లక్షణంగా కనిపిస్తున్నది. బతుకమ్మ పండుగ వస్తే యూట్యూబ్‌లో పెట్టడం కోసం ఒక పాట రాసి, ఆ తరువాత పండుగ అయిపోగానే ఆ పాటను మరిచిపోయినట్టు, ఈ ఆధునిక జానపద పాటలు సైతం కొంతకాలం అలరించి కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు ఒక సామాజిక సమస్యపైన వచ్చిన పాట ప్రజలకు నచ్చితే అది కనీసం ఇరవై ముప్పయి యేండ్ల పాటు పాడుకునేవారు. అట్లా ఆ పాటలు ప్రజల నోళ్లల్లో సజీవంగా ఉండేవి. ఇవాళ మాత్రం ఆ పరిస్థితి లేదు. అందుకు కారణం ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు బలంగా పని చేస్తున్నది. ఒకప్పుడు ప్రజల్లో విశేష ఆదరణ పొందిన సామాజిక ఉద్యమ పాటలను సినిమాల్లో వాడేవారు. ఇవాళ మాస్‌ను అలరించడానికి కూడా ఈ జానపద బాణీలతో కూడిన పాటలకే పెద్దపీటను వేస్తున్నారు. సినిమా హిట్ కావాలన్నా ఈ పాటల మీదే ఆధారపడి ఉంటున్నదంటే అతిశయోక్తి కాదు.
- డా.పసునూరి రవీందర్
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత
77026 48825
