
- గోదావరి నది ఫ్లడ్ లెవల్‌లో ఉందంటూ సాగునీటి శాఖ అభ్యంతరం
- అశ్వరావు పేట ఫ్యాక్టరీకి ఆయిల్ పామ్ తరలింపు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్ పట్ల వద్ద నిర్మించాలనుకున్న పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ బ్రేక్ వేసింది. ఈ ఫ్యాక్టరీని నిర్మించే స్థలం గోదావరి పరివాహక ప్రాంతం ఫ్లడ్ లెవెల్ పరిధిలో ఉన్న కారణంగా ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయడం లేదు. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీకి పొల్యూషన్ బోర్డ్ తో పాటు ఇతర అన్ని రకాల అనుమతులు లభించాయి.
దీంతో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇరి గేషన్ శాఖ నుంచి మాత్రం ఇప్పటి వరకు అనుమతి జారీ కాలేదు. దీంతో ఏడాదిన్నరగా ఈ పరిశ్రమ పనులు మొదలు కావడం లేదు. గోదావరి నది ఫ్లడ్ లెవెల్ పరిధిలో పరిశ్రమ నిర్మాణ స్థలం ఉన్న కారణంగా భవిష్యత్తులో కూడా ఈ పరిశ్రమకు ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్ఓసి జారీ కావడం అసాధ్యమని అనుకుంటున్నారు. దీంతో ఈ పరిశ్రమ యాజమాన్యమైన ప్రీ యూనిక్ కంపెనీ ప్రత్యామ్నాయ స్థల అన్వే షణలో ఉన్నట్లు సమాచారం. నిర్మల్ జిల్లాలో స్థలం లభించనట్లయితే సరిహద్దులో ఉన్న నిజామాబాద్ జిల్లాలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం మొదటి దశ లో సాగుచేసిన ఆయిల్ పామ్ పంట దిగుబడులు చేతికొచ్చాయి. దీంతో ఈ పంటను ప్రీ యూనిక్ కంపెనీ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. జిల్లాలోని దిలావర్పూర్, లోకేశ్వరం మండల కేంద్రాల్లో రెండు రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. మరో ఎనిమిది చోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. కొనుగోలు చేసిన ఆయిల్ పామ్ పంటను ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట ఫ్యాక్టరీకి తరలించనున్నారు.
మొదటి దశ దిగుబడి...
మొదటి దశ కింద జిల్లాలో మొత్తం 1335 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట దిగుబడి రానుంది. ఒక ఎకరానికి రెండు టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 ఎకరాలకు సంబంధించిన పంట కొనుగోళ్లు పూర్తయ్యాయని అధికారులు వివరిస్తున్నారు. టన్ను ఆయిల్ ఫామ్ గెలలకు రూ. 20 వేలు సదరు ఫ్రీ యూనిక్ కంపెనీ రైతులకు చెల్లిస్తుంది. ప్రస్తుతం ప్రీ యూనిక్ కంపెనీ ఆధ్వర్యంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పంటను విక్రయించిన రైతులకు వారం నుంచి పది రోజుల లోపల డబ్బులను చెల్లించనున్నట్లు హార్టికల్చర్ శాఖ అధికారులు చెబుతున్నారు.
పామాయిల్ పంట అశ్వరావుపేటకు తరలింపు..
నిర్మల్‌లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులు మొదలు కాకపోవడంతో ఇక్కడ కొనుగోలు చేస్తున్న ఆయిల్ ఫామ్ గెలలను సంబంధిత కంపెనీ ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట ఫ్యాక్టరీకి మిల్లింగ్ కోసం తరలించనున్నారు. మొదటి దశకు సంబంధించిన పంటను డిసెంబర్ నెలాఖరు వరకు కొనుగోలు చేయాలని ప్రీయూనిక్ యాజమాన్యం నిర్ణయించింది. ఆయిల్ పామ్ సాగు రైతులందరికీ కంపెనీ నుంచి ప్రత్యేక ఐడెంటిటీ కార్డును కూడా జారీ చేస్తున్నారు. ఈ కార్డు ఉన్న రైతులకు ఉద్యానవన శాఖ ద్వారానే కాకుండా ప్రీ యునిక్ కం పెనీ ద్వారా ప్రయోజనాలు అందించనున్నారు. ఈ పంటను సాగు చేస్తున్న ఒక్కో రైతుకు ప్రత్యేక ఐడీ నెంబర్‌ను కూడా కంపెనీ కేటాయించింది.
ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ సర్వే
ఫ్యాక్టరీ నిర్మాణ స్థలం నది పరివాహక ప్రాంతంలో ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఇరిగేషన్ శాఖ ఈ స్థలంపై సర్వే చేపట్టింది. తమ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా ఈ స్థలం గోదావరి నది ఫ్లడ్ లెవెల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ శాఖ ఎన్ఓసిని జారీ చేయలేదు. ఈ ప్రాంతంలో పరిశ్రమను నిర్మించ వద్దంటూ కంపెనీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా మూడు దశల వారీగా దాదాపు పదివేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు కొనసాగుతోంది.
ఇందులో భాగంగానే మొదటి దశ కింద 1350 ఎకరాల్లో సాగుచేసిన పంట దిగుబడి ఇప్పటికే చేతికొస్తుంది. పంట దిగుబడులు మొదలు కావడంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రీ యూనిక్ కంపెనీ యాజమాన్యం ప్రాథమికంగా రెండు చోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. మరో ఎనిమిది చోట్ల కూడా ఈ కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.