అతివలకు అండగా.. జెండర్ కమిటీలు

అతివలకు అండగా..  జెండర్ కమిటీలు
  • గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు కమిటీల ఏర్పాటు
  • కామారెడ్డిలో తొలి విడతలో రెండు మండలాల్లో కౌన్సిలింగ్ సెంటర్లు 

కామారెడ్డి, వెలుగు: మహిళలు ఎదుర్కొనే వివక్ష, వేధింపులు, బాల్య వివాహాలు, అనారోగ్యం వంటి  సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది. గ్రామ, మండల, జిల్లాస్థాయిల్లో జెండర్ కమిటీలు ఏర్పాటు చేసి అతివలకు అండగా నిలువనుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఈ కమిటీలను రూపొందించనున్నారు. గతంలో ఉన్న జెండర్ కమిటీలు నిర్వీర్యమై పదేళ్లకు పైగా అవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం మళ్లీ వాటిని తీర్చిదిద్దుతోంది. ఈ కమిటీలు మహిళలకు వివిధ సామాజిక సమస్యలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాయి. జిల్లాలో తొలి విడతగా రెండు మండలాల్లో కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. 

రెండో విడతలో మరో రెండు మండలాల్లో ఈ సెంటర్లు ప్రారంభమవుతాయి. కమిటీల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే షురూ అయ్యింది. జిల్లాలో 22 మండల సమాఖ్యలు, 715 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. వీటిలో సుమారు లక్షా 79 వేల మంది సభ్యులు ఉన్నారు. కమిటీల ఉద్దేశం, పనితీరుపై ఈ నెలలో స్వయం సహాయక సంఘాల డీపీఎంలు, జిల్లా సమాఖ్య ప్రతినిధులకు శిక్షణ ఇవ్వనున్నారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా..

మహిళలు సామాజిక, కుటుంబ, అనారోగ్యం వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్వయం సహాయక సంఘాల సమావేశాల్లో కొన్నింటిపై చర్చ జరిగినా, అనేక సమస్యలు పరిష్కారం కావడం
లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మహిళలకు అండగా నిలిచి, సమస్యలను సిస్టమేటిక్‌గా పరిష్కరించేందుకు జెండర్ కమిటీలు ఏర్పాటు చేయనుంది. ప్రధానంగా వివక్ష, బాల్య వివాహాలు, అత్తగారింటి వేధింపులు, సమాజంలో ఎదురయ్యే అవమానాలు, అనారోగ్యం వంటి సమస్యలపై అవగాహన కల్పించడమే కమిటీల ముఖ్య ఉద్దేశం. కొన్నిసార్లు ఎవరితో చెప్పుకోవాలో తెలియని సమస్యలను ఈ కమిటీలు పరిష్కరించనున్నాయి.

 పోషకాహార లోపాలు, మానవ అక్రమ రవాణా నిరోధం, గృహ హింస కేసులు, కుటుంబ తగాదాల వంటి పరిష్కారాల్లో కూడా కమిటీలు చొరవ చూపుతాయి. బాల్యవివాహాలు కట్టడి చేయడంలో  కీలకపాత్ర పోషించనున్నాయి. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో జెండర్ కమిటీలు ఉంటాయి. వీటిలో స్వయం సహాయక సంఘాల సభ్యులు, చదువుకున్నవారు, మాట్లాడే నేర్పు కలవారు, బాధితుల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించే చొరవ ఉన్నవారిని  ఎంపిక చేస్తారు. ముఖ్యంగా 25 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రతి గ్రామంలోని అన్ని సంఘాల నుంచి ముగ్గురు సభ్యులను ఎంపిక చేస్తారు. 

వీరు స్థానికంగా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారు. గ్రామస్థాయిలో పరిష్కారం కాని అంశాలను మండల లేదా జిల్లాస్థాయికి 
పంపవచ్చు. మహిళల సమస్యలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, పరిష్కార మార్గాలు చూపడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కమిటీల ప్రధాన లక్ష్యం. జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేయబడతాయి. మొదటి, రెండో దశల్లో నాలుగు మండలాల్లో ప్రారంభించి, క్రమంగా జిల్లావ్యాప్తంగా విస్తరించనున్నారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన అధికారులు గ్రామ, మండల, జిల్లాస్థాయి సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నారు.

మనోధైర్యం కో-సం కౌన్సిలింగ్ సెంటర్లు..    

మహిళలకు మనోధైర్యం, ఆత్మవిశ్వాసం కల్పించేందుకు జెండర్ కమిటీల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. మొదటి విడతలో భిక్కనూరు, లింగంపేట మండలాల్లో, రెండో విడతలో దోమకొండ, బాన్సువాడ మండలాల్లోసెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. జెండర్ కమిటీలకు వచ్చే సమస్యలను పరిష్కరించడమే కాకుండా, అవసరమైతే బాధిత మహిళలకు, హింసను ఎదుర్కొంటున్న వారికి, కుటుంబ సభ్యులకూ  కౌన్సిలింగ్ ఇస్తారు.  గ్రామ, మండల స్థాయి కమిటీల సమన్వయంతో ఈ సేవలు నిరంతరం కొనసాగనున్నాయి.