వాతావరణ మార్పులతో పంటలపై ప్రభావం.. పెరుగుతున్న తిండిగింజల కొరత.. సర్కార్లు వేగంగా స్పందించాలి

వాతావరణ మార్పులతో పంటలపై ప్రభావం.. పెరుగుతున్న తిండిగింజల కొరత.. సర్కార్లు వేగంగా స్పందించాలి

రానురాను  ప్రపంచమంతటా ప్రకృతి వైపరీత్యాలు తీవ్రమవుతున్నాయి.  వాటివల్ల ఉన్న అరకొర ప్రకృతి వనరులు నాశనమవ్వడంతోపాటు మానవులు ఏర్పరుచుకున్న, నిర్మిస్తున్న వ్యవస్థలు ధ్వంసం అవుతున్నాయి. ప్రకృతి విలయతాండవం ఇంకా ఇంకా పెరుగుతున్నది. ఊహించని రీతిలో ఉత్పాతాలు సంభవిస్తున్నాయి. తుపాన్లు, వర్షాలు వస్తున్నాయని ముందస్తుగా తెలిసినా వాటి తీవ్రత, విస్తృతి గురించి మాత్రం చెప్పలేకపోతున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు.  

ఉత్తర భారతదేశంలో మేఘాల విస్ఫోటనం (క్లౌడ్ బరస్ట్), కాలిఫోర్నియాలో క్లైమేట్​ నదులు విభిన్న వాతావరణ సంఘటనలు అయినప్పటికీ రెండింటి వల్ల సాపేక్షంగా తక్కువ వ్యవధిలో తీవ్రమైన వర్షపాతం  నమోదు అవుతున్నది.  భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వర్షాలు సాధారణంగా పంటలను పోషిస్తాయి, పచ్చదనాన్ని పెంచుతాయి.  కానీ, ఆగస్టు 2025లో ఈ రాష్ట్రంలోని చోసిటి గ్రామాన్ని కుంభవృష్టి వర్షాల వల్ల 60 మంది మరణించారు, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ తీవ్రమైన వర్షపాతం మేఘాల విస్ఫోటనం ఫలితంగా సంభవించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఒకప్పుడు అరుదుగా జరిగే  మేఘాల   విస్ఫోటనాలు వాతావరణ మార్పుల కారణంగా ఇప్పుడు తరచుగా జరుగుతున్నాయి. తీవ్రత కూడా పెరుగుతున్నది.  తీవ్ర వర్షపాతం వల్ల నదులు, జలాశయాలతో కూడిన ప్రాంతీయ నీటి పారుదల వ్యవస్థల సామర్థ్యం దాటిపోయి వరదలకు దారితీస్తున్నది. ఎక్కడ వరద వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.  ఏటా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాలు కూడా ఆకస్మిక మేఘాల విస్ఫోటనాల వల్ల దెబ్బతింటున్నాయి. 

తీవ్రమైన వర్షాలు తరచుగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటానికి కారణమవుతున్నాయి. దీనివల్ల విస్తృతమైన విధ్వంసం ఏర్పడుతున్నది. ఇది అటవీ నిర్మూలనను వేగవంతం చేస్తుంది, నేల కోతకు కారణమవుతుంది,  మొత్తంగా పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తున్నది.  భూగ్రహ పరిణామాలు అనేక ముఖ్యమైన సంకేతాలు కోడ్ రెడ్ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. విస్తరిస్తున్న అత్యవసర పరిస్థితి గురించి  కనీస అవగాహన పాలకులకు లేకపోవడం, దూరదృష్టి లేకపోవడం, రాజకీయ నిష్క్రియాపరత్వం సమస్యల తీవ్రతను పెంచుతున్నది.  ప్రపంచ వాతావరణ సంస్థ 2024  రికార్డు స్థాయిలో అత్యంత వేడి సంవత్సరంగా నివేదించింది. 

ప్రమాదంలో వన్యప్రాణుల మనుగడ

2024లో శిలాజ ఇంధనాల వినియోగం (బొగ్గు, చమురు, సహజవాయువు) రికార్డు స్థాయికి చేరుకుంది. అన్నీ గరిష్ట స్థాయిలో ఉన్నాయి. సౌర, పవన వినియోగం కలిపి కొత్త రికార్డును సృష్టించింది.  కానీ, శిలాజ ఇంధనశక్తి వినియోగం కంటే 31 రెట్లు తక్కువగా ఉంది. ఇంకా చాలా పెరగాలి.  2025లో  ఇప్పటివరకు వాతావరణ కార్బన్ డయాక్సైడ్ రికార్డు స్థాయిలో ఉంది.  ఎల్​నినో,  తీవ్రమైన అటవీ మంటల కారణంగా భూమి కార్బన్ తీసుకోవడంలో  అకస్మాత్తుగా తగ్గుదల కారణంగా ఇది మరింత దిగజారింది.   ట్రాపికల్ అడవులలో అగ్నికి ఆహుతి సంఘటనలు 2023 తరువాత 370 శాతం పెరిగాయి.   

ఈ రకమైన దహనం వల్ల కర్బన ఉద్గారాలు పెరగడంతోపాటు జీవవైవిధ్యం  కూడా కోల్పోయాం. కర్బన ఉద్గారాలను తగ్గించే సామర్థ్యం ఉన్న దట్టమైన అడవులు అగ్నికి ఆహుతి అవడం వల్ల దుష్పరిణామాలు నష్టానికి ఆజ్యం పోశాయి. సముద్రాల వేడి రికార్డుస్థాయికి చేరుకుంది. సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల 84% కోరల్ రీఫ్ ప్రాంతం  ధ్వంసం అయ్యింది.  వాతావరణ మార్పుల వల్ల వేలాది వన్యప్రాణుల జాతుల మనుగడ ప్రమాదంలో పడింది. 3,500 కంటే ఎక్కువ జాతులు ఇప్పుడు కనుమరుగు అయ్యే అవకాశాలున్నాయి.  జంతువుల జనాభా కూడా క్షీణించినట్లు కొత్త ఆధారాలు  ఉన్నాయి.

తగ్గుతున్న పంటల దిగుబడి

2020 – 2025 మధ్య మన దేశంలో ముఖ్యమైన 100కి పైగా వరద సంఘటనలు సంభవించాయి. ప్రతి సంవత్సరం వాటి సంఖ్య పెరగడంతో పాటు తీవ్రత కూడా పెరుగుతున్నది. నష్టాలు కూడా అదే తరహాలో ఎక్కువ కావడం కూడా చూస్తున్నాం. దాదాపు అన్ని రాష్ట్రాలలో విపరీత, అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బ తినడం, చీడపీడ పెరగడం, రైతులకు ఉత్పత్తి ఖర్చు పెరగడం, దిగుబడి తగ్గడం కూడా ఆనవాయితీగా మారింది.  కేంద్ర ప్రభుత్వ పంటల సేకరణలో అన్ని పంటలు ఉండవు. ఉన్న రెండు మూడు పంటలకు తేమశాతం ఒక అడ్డంకిగా మారింది. పంట ఎండబెట్టే  మౌలిక సౌకర్యాలు రైతుల వద్ద లేవు.  విపరీత వర్షాలు ఎండబెట్టే ఆస్కారం ఇవ్వడం లేదు.  కేంద్ర ప్రభుత్వ సంస్థలు తేమశాతం ప్రాథమిక నిబంధనగా పెడుతున్నాయి. 

పంటల సేకరణ ఆ విధంగా రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా మారింది.  ఈ యేడు దాదాపు అన్ని రాష్ట్రాలలో పంట ఏదైనా వివిధ దశలలో విత్తనాలు నాటడం దగ్గర నుంచి మార్కెట్ల వరకు వర్షాల దెబ్బపడింది. ఉల్లి, మక్క, ప్రత్తి, వరి ధాన్యం, సోయా వంటి పంటలు నీటిపాలు అవుతున్నాయి. 2024లోనే  తెలంగాణ సహా, 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో తీవ్ర వాతావరణ సంఘటనల వల్ల 32 లక్షల  హెక్టార్ల పంట విస్తీర్ణం ప్రభావితమైంది. వరి, గోధుమ, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల మొత్తం దిగుబడి 15% తగ్గిందని అంచనా.  ఇటీవల వచ్చిన మొంథా తుపాను తెచ్చిన విపరీత వర్షాల వల్ల తెలంగాణాలో 4.5 లక్షల ఎకరాల పంట పోయింది.

మార్కెట్లో తిండిగింజల కొరత

కేరళలో వరి ఉత్పత్తి తగ్గి బియ్యం దిగుమతి చేసుకుంటున్నారు. 2023–24లో, కేరళ దాదాపు 5.6 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసింది, ఇది దాని వినియోగ అవసరాల కంటే చాలా తక్కువ. కేరళలో ఏటా 30 లక్షల టన్నుల బియ్యం అవసరం ఉండగా 2023–24లో కేవలం 5.6 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసింది.  మార్కెట్లో తిండిగింజల కొరత పెరగడంతో ధరలు పెరుగుతున్నాయి. సామాన్యులకు అనేక నిత్యావసర తిండి వస్తువులు అందని పరిస్థితి ఏర్పడుతున్నది. భారత ప్రభుత్వం కేవలం వరి, గోధుమలకు సబ్సిడీలు ఇస్తున్నది. కూరగాయలు,  ఆకుకూరలు, పండ్ల ధరలు పెరిగి పూర్తిస్థాయి భోజనం చేయలేని కుటుంబాలు అనేకం ఉన్నాయి.  చిన్న, సన్నకారు రైతుల మీద ఈ అకాల వాతావరణ మార్పుల భారం అధికమవుతున్నది. 

ఆర్థిక నష్టాలు పెరుగుతున్నాయి. ప్రపంచ వాతావరణ సదస్సులలో వాతావరణ మార్పుల బాధితులకు అండగా నిలవాలని చిన్న దేశాలు, ఆఫ్రికా దేశాలు ఒత్తిడి తెచ్చి ఒక నష్ట పరిహార నిధి (లాస్ అండ్ డామేజి ఫండ్) ఏర్పాటు చేయించారు. ఇది ఇంకా పూర్తి రూపం తీసుకోలేదు. ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  మన దేశంలో కూడా  వాతావరణ మార్పు బాధితులు పెరుగుతున్నారు. నేరుగా, వివిధ రూపాలలో దీని బారిన పడి ప్రాణాలు, ఆదాయ, ఆస్తి నష్టాలు అనుభవిస్తున్నారు. వీరికి మన దేశంలో నిధి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. అంతర్జాతీయ నిధిలో వీరికి ఉపశమన నిధులు కావాలని మన ప్రభుత్వం కూడా అడగాలి. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా  స్పందించాలి

ప్రస్తుతం మన దేశంలో హోం మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ డిజాస్టర్ మేనేజ్​మెంట్ చట్టం పరిధిలో ప్రకృతి వైపరీత్యాల నష్టాన్ని, లేదా స్పందనని పరిగణిస్తున్నారు. అందులో, అనేక లోసుగులున్నాయి. నష్టపరిహారం బాధితులకు తగినంతగా, సరి అయిన సమయంలో అందడం లేదు.  తెలంగాణలో  గడిచిన రెండు సంవత్సరాలలో వచ్చిన నష్టాలకు ఎంతోకొంత లెక్క కట్టినా రైతులకు చేరలేదు. నష్టాలను అంచనా వేయడంలో కూడా అధికార యంత్రాంగం విఫలం అవుతున్నది. రైతులకు,  గ్రామాలలో వివిధ జీవనోపాధులకు కలుగుతున్న నష్టాలకు ప్రతిగా ప్రభుత్వ యంత్రాంగం వేగంగా కదలవలసిన అవసరం ఉన్నది. 

పంటల బీమా పథకానికి అదనంగా నష్టపరిహార పథకాలు ఏర్పాటు చేయాలి.  తగిన నిధులు ఏర్పాటు చేయాలి. పంటల బీమా పథకంలో రైతులకు పూర్తిస్థాయి నష్టపరిహారం రావడానికి తగిన మార్పులు తక్షణమే చేయాలి. నష్టాల అంచనాలో, నష్టపరిహారం అందించటంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పాత్రను సమీక్షించుకుంటూ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక ఉద్యమాలతో ప్రత్యేక సాంకేతిక పరిష్కారాలను, విస్తృత సామాజిక పరివర్తన, పాలనలో మార్పు, విధానాల కూర్పు వంటి వాటిని అనుసంధానించే వ్యవస్థల మార్పు అవసరం ఉంది.

- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​