తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు కోసం జీవో 9 తీసుకొచ్చింది. ఇది న్యాయ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ రిజర్వేషన్ పెంపును 9వ షెడ్యూల్లో చేర్చడమే పరిష్కారమని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. బీసీ సంఘాలు సైతం ఇదే డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయ మైలేజీకి నష్టం జరగకుండా ప్రభుత్వం, విపక్షాలు సైతం మద్దతిస్తున్నాయి. ఈ క్రమంలో తొమ్మిదో షెడ్యూల్ ప్రధానంగా చర్చకు వస్తున్నది. ఇది రాజ్యాంగంలో ప్రత్యేకమైంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ షెడ్యూల్ లేదు. రాజ్యాంగం అమలైన మొదట్లో వ్యక్తిగత ఆస్తి హక్కు ఆర్టికల్ 31 ప్రాథమిక హక్కుగా ఉండేది.
ప్రభుత్వం 1951లో ప్రజల సంక్షేమం దృష్ట్యా భూసంస్కరణ చట్టాలు అమలు చేయడంతో భూస్వాములు, జమీందారులు అదనంగా పొందిన భూములు(ఆస్తులు) కోల్పోవల్సి రావడంతో కోర్టులను ఆశ్రయించారు. ఈ క్రమంలో న్యాయ సమీక్ష నుంచి తప్పించడానికి కేంద్రం 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా తొమ్మిదో షెడ్యూల్ తీసుకువచ్చారు. ఆస్తి హక్కును 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి చట్టపరమైన హక్కుగా మార్చారు. ఇప్పుడది 300 ఎ అధికరణలో చేర్చారు.
రిజర్వేషన్ పరిమితిని పున:సమీక్షించాలి
సంక్షేమ యంత్రాంగానికి సంబంధించి ఏదైనా ప్రత్యేక అంశం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అప్పుడే చట్టబద్ధత ఉంటుంది. తమిళనాడు రిజర్వేషన్ పెంపుకు 76వ రాజ్యాంగ సవరణ (1994) ద్వారా ఆ రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్ల పెంపును ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో వర్తింపచేశారు. దేశంలో ఇప్పటివరకు 284 చట్టాలు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడమైంది. ఈ షెడ్యూల్లోని పలు చట్టాలు సామాజిక అసమానతలను తగ్గించడంలో, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి దోహదపడుతున్నాయి.
భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ అనేది జనాభా ప్రకారం ఆయా వర్గాల ప్రాతినిధ్యం. కానీ, సుప్రీంకోర్ట్ ప్రతిభ రక్షణ పేరుతో ఇందిరా సాహ్ని కేసులో 50శాతం పరిమితి విధించింది. ఇది ప్రభుత్వాలకు సైతం రాజకీయంగా ఇబ్బందిగా మారింది. దేశంలో తమిళనాడు తరహాలో పలు రాష్ట్రాలు రిజర్వేషన్లను పెంచాలని భావిస్తున్నాయి. 2023లో బిహార్ ప్రభుత్వం 65శాతం రిజర్వేషన్ పెంపును పాట్నా హైకోర్టు కొట్టివేసింది.
ఇదేవిధంగా తెలంగాణకు కూడా అదే పరిస్థితి ఎదురు కావడంతో తమిళనాడు మాదిరిగా 9వ షెడ్యూల్లో చేర్చాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఏర్పాటయ్యింది. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్, ఉమ్మడి ఏపీ రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు కీలక భూమిక పోషిస్తున్నారు. వీరితోపాటు పలు సంఘాల మేధావులు కలిసి వస్తున్నారు. రాజకీయాలకతీతంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలనేది డిమాండ్. ఇది బీసీ రిజర్వేషన్లకు వజ్ర కవచంగా నిలవనుంది.
వివిధ రూపాల్లో ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వం సైతం బీసీ రిజర్వేషన్లను రాజకీయ కోణంగా చూడకుండా సబ్బండ వర్గాల అభివృద్ధిగా భావించాలి. అన్ని పార్టీలను కలుపుకొని అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి. కోర్టులు సైతం ప్రతిభ పేరుతో అవకాశాలను లాక్ చేయడం సరికాదు. కాలమాన పరిస్థితులకనుగుణంగా సుప్రీంకోర్టు 50శాతం రిజర్వేషన్ పరిమితిని పునః సమీక్షించాలి. అభివృద్ధి జరగాలంటే ఉచిత పథకాలకు బదులు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఆర్థికవేత్తల భావన. ఇందుకు రిజర్వేషన్స్ పెంపు ఒక మార్గం కానుంది.
- సంపతి రమేష్ మహారాజ్, సోషల్ ఎనలిస్ట్
